డెంగీతో విద్యార్థి మృతి
గుమ్మఘట్ట: మండలంలోని తాళ్లకెరలో ఈడిగ క్రిష్టప్ప, ప్రమీలమ్మల ఏకైక కుమారుడు లేపాక్షి (10) డెంగీ జ్వరం సోకి సోమవారం మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల మేరకు వారం రోజుల క్రితం బాలుడికి తీవ్ర జ్వరం రావడంతో కుటుంబీకులు కర్ణాటక రాష్ట్రం చెళ్లకెర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం తీసుకెళ్లారు. ప్లేట్‌లెట్స్ పడిపోవటాన్ని గమనించిన వైద్యులు బాలుడిని బెంగళూరుకు తీసుకెళ్లాలని సూచించారు. బెంగళూరులో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. బాలుడు రాయదుర్గం సెయింట్ పాల్ స్కూల్‌లో నాల్గో తరగతి చదువుతున్నాడు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించి దోమలు వృద్ధి చెందడంతోనే ఇలా వ్యాధులు ప్రబలుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు.