నెల్లూరులో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు
నెల్లూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. నెల్లూరు పట్టణంలో శనివారం ఉదయం ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పారిశుధ్య లోపం విషయంలో అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల అలసత్వం వల్ల డెంగీ వ్యాధి ప్రబలుతుందని సీఎం వ్యాఖ్యానించారు.
బ్రహ్మానందపురంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోతే చర్యలు ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. తర్వాత బారాషహీద్ దర్గాను సందర్శించిన చంద్రబాబు.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్వర్ణాల చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు వెంగళరావు నగర్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, పలు కుటుంబాల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీరు సక్రమంగా రావట్లేదని స్థానికులు సీఎంకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకొని ప్రత్యేక హెలికాప్టర్‌లో విజయవాడ బయలుదేరారు.