
ఆటలో ఆల్‌రౌండర్‌నే..
హాయ్ పిల్లలూ.. రోజూ చేస్తున్న రోటిన్ వర్క్‌ను పక్కనపెట్టి కాసేపు మీతో సరదాగా గడిపేందుకు వచ్చాను. ఇంతకూ నేనెవరో చెప్పలేదు కదూ.. నాపేరు పగడాల లక్ష్మీనారాయణ. మీ చదువుకుంటున్న అన్ని పాఠశాలలు అంటే ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లన్నింటీనీ పర్యవేక్షిస్తుంటాను. నేను చేస్తున్న పని వల్ల నాకు జిల్లా విద్యాధికారి అనే హోదా ఉంటుంది.
ఇక నేను పుట్టింది... పెరిగింది.. చదువుకున్నది.. అంతా అనంతపురంలోనే. మా నాన్న వెంకటేశ్వర్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవారు. ఇక అమ్మ కృష్ణవేణమ్మ ఇంటి పట్టునే ఉంటూ మా బాగుగోలు చూసుకునేది. మేము ఆరుగురంఅన్నదమ్ములం. అందులో నేనే చిన్నవాణ్ని. హైస్కూల్ వరకూ ఇక్కడే గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్‌లో చదువుకున్నా.. తర్వాత ఇంటర్మీడియట్‌ను కొత్తూరు జూనియర్ కళాశాలలో, డిగ్రీని ఆర్ట్స్ కళాశాలలో, పీజీని ఎస్కేయూలో చేశాను.
ఇక ఆటలంటరా... చిన్నప్పుడు స్నేహితులతో కలిసి చాలా ఆటలు ఆడుకునేవాళ్లం. అందులో నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా, మీడియం పేస్ బౌలర్‌గా.. రాణించాను. ఒక విధంగా చెప్పాలంటే క్రికెట్‌లో నేను ఆల్‌రౌండరిని అన్నమాట. అప్పట్లో ఎమరాల్డ్స్ 11 అనే జట్టుకు నేనే కెప్టెన్‌ని. అప్పుడు రాష్ట్ర స్థాయిలో జరిగిన ఓ టోర్నీ విన్నర్‌గా మా జట్టు నిలిచింది. ఆ రోజు ఇప్పటికీ నేను మరిచిపోలేను. ఎందుకంటే ఆ సమయంలో విజేత జట్టు కెప్టెన్‌గా అప్పటి జిల్లా కలెక్టర్ చంద్రమౌళీ గారి చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడం ఓ మధుర జ్ఞాపకం.
ఇక నా హాబీలంటారా.. చిన్నప్పటి నుంచి రచనలు చేసేవాణ్ని. 1977లో నేను 8వ తరగతి చదువుతున్న సమయంలో అప్పటి పాపులర్ దినపత్రిక ‘ఆంధ్రపత్రిక’లో నేను రాసిన ‘విద్యారంగం - నేటి సమస్య’ అనే కాలమ్‌ను ప్రచురించారు. ఇది కేవలం ఆటెండెన్స్ ఆధారంగా విద్యార్థులను పాస్ చేసే పద్ధతిని విమర్శిస్తూ రాసిన నా తొలి వ్యాసం. దీనిని ప్రచురణకు స్వీకరిస్తున్నట్లు ఆంధ్రపత్రిక యాజమాన్యం మా ఇంటికి ఓ ఉత్తరాన్ని పంపింది. ఇప్పటికీ ఆ ఉత్తరం నా దగ్గర భద్రంగా ఉంది. అలాగే నేను రాసిన కథ కూడా ‘హాస్యప్రభ’లో ప్రచురితమైంది. ఆ పత్రిక నుంచి వచ్చిన ఉత్తరాన్ని కూడా పదిలంగా దాచుకున్నాను. మీ కోసం ఇలాంటి కొన్ని ఉత్తరాలను చూపుతున్నాను. సాత్విక్ పేరుతో నేను రాసిన దాదాపు పది సీరియల్ నవలలు, 50 కథలు వివిధ వార, మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఐదు సార్లు నవలా రచయితగా, 15 సార్లు కథా రచయితగా ఉత్తమ అవార్డులు స్వాతి వారపత్రిక నుంచి అందుకున్నాను.
- అనంతపురం ఎడ్యుకేషన్