సీతమ్మ చెరువులో చోరీ
Published Wed, Nov 30 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM
చింతదిబ్బ (యలమంచిలి) : చింతదిబ్బ పంచాయతీ సీతమ్మచెరువులో సోమవారం అర్ధరాత్రి దొంగలు మూడిళ్ల తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. రెండిళ్లలో ఎటువంటి నగదు, బంగారం లేకపోవడంతో మూడో ఇంటిలో ఉన్న నగదు, బంగారం, టీవీలను తస్కరించారు. ఎస్‌ఐ పాలవలస అప్పారావు కథనం ప్రకారం.. బొంతు శేఖర్ గల్ఫ్‌లో ఉంటాడు. అతని భార్య నిర్మల సోమవారం రాత్రి భోజనం చేసిన తరువాత పక్కనే వాళ్ల బంధువుల ఇంటిలో పడుకుంది. ఆ ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి వెళ్లిన దొంగలు ఇంటిలో ఉన్న కాసున్నర బంగారం, రూ. 5వేలు, ఓ ఎల్‌సీడీ టీవీ దోచుకెళ్లారు. ఆ సమీపంలో ఉన్న మాదాసు మహాలక్ష్మి, తానేటి శ్రీనుల ఇళ్ల తాళాలనూ పగులకొట్టారు. కానీ ఆ ఇళ్లలో ఎటువంటి నగదు, వస్తువులు లేకపోవడంతో చోరీ జరగలేదు. నిర్మల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మధ్య కాలంలో సీతమ్మచెరువులో దొంగతనం జరగడం ఇదే తొలిసారి.
Advertisement
Advertisement