ఎడారులను తలపిస్తున్న చెరువులు
ఎడారులను తలపిస్తున్న చెరువులు
Published Sun, Aug 28 2016 6:33 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
నకిరేకల్
నకిరేకల్ : ప్రస్తుత వర్షాకాలంలోనూ కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆగస్టులో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో నకిరేకల్ నియోజకవర్గంలోని పంటలు ఎండిపోతూ రైతన్నలు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. వర్షాలు లేక చెరువులు, కుంటలు, చివరకు వ్యవసాయ బావులు వెలవెలబోతున్నాయి. దీంతో రైతులు సాగు చేసిన వేలాది ఎకరాల వరిపంట ఎండుముఖం పట్టింది. ఫలితంగా సాగుకోసం వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతుల ఆశలు అడియాసలుగా మారాయి.
చెరువుల్లో చుక్కనీరు లేని దుస్థితి..!
నకరేకల్ నియోజకవర్గంలోని నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్, నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేట మండలాల్లోని ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో ఎక్కడా చుక్క నీరు లేదు. నియోజకవర్గంలో మెుత్తం 83 చెరువులు, 211కుంటలున్నాయి. వీటికింద సుమారు 12,100 ఎకరాలలో ఆయకట్టు ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో 11,912 హెక్టార్లలో వరి, 24,737హెక్టార్లలో పత్తి, 3,910 హెక్టార్లలో పెసర, 5,585 హెక్టార్లో కంది, 5,468 హెక్టార్లల్లో వేరుశనగ సాగు చేశారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో చెరువులలో, కుంటలలో నీరు లేకపోవడంతో బోర్లపైనే ఆధారపడి రైతులు వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారు. వర్షాలు కురవక పోవడంతో మెట్టపంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. నకిరేకల్, కేతేపల్లి మండలాల్లోని ప్రధాన చెరువుల్లోకి ఏఎమ్మార్పీ కాలువల ద్వారా నీరు రావాలి
ఉన్నా ఈ ఏడాది విడుదల చేయకపోవడంతో ఆ చెరువుల కింద సాగుచేసిన పొలాలు పూర్తిగా ఎండిపోయాయి.
కరువు కోరల్లో ‘నకిరేకల్’..
నకిరేకల్ మండలం వ్యాప్తంగా 13 చెరువులు, 84 కుంటలున్నాయి. వీటి పరిధిలో 5,200 ఆయకట్టు ఉంది. అయితే నేటికీ ఏ చెరువుల్లోకి చుక్క నీరు రాలేదు. అయితే కొందరు రైతులు విచ్చలవిడిగా బోర్ల వేయిస్తున్నా ఫలితం దక్కడం లేదు. ప్రతి ఏడాది నకిరేకల్ మండలానికి ఎమ్మార్పీ కాల్వలకు నీరు విడుదల చేసేవారు ఈ ఏడాది చుక్క నీరును కూడా వదలలేదు.. మరోవైపు వర్షాలు లేక భూగర్భజలమట్టం అడుగంటింది. రైతుల సాగు నీటి బోర్లులో నీరు రాక మొరాయస్తున్నాయి. దీంతో పండ్ల తోటల రైతుల పరిస్థితితోపాటు ఇటు మెట్టపంటలు, అటు ఆయకట్టులో సాగు చేసిన వరి పొలాలు వాడుబారుతున్నాయి. దీంతో నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కంటే నకిరేకల్ మండలంలో కరువు ఛాయలు అధికంగా కనిపిస్తున్నాయి.
నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు వాటి కింద సాగు విస్తీర్ణం..
మండలం చెరువులు కుంటలు విస్తీర్ణం(ఎకరాలలో)
–––––––––––––––––––––––––––––––––––––––––––––––
నకిరేకల్ 13 84 5,200
కేతేపల్లి 17 15 3,200
కట్టంగూర్ 13 40 3,500
నార్కట్‌పల్లి 10 30 1,100
చిట్యాల 10 12 1,500
రామన్నపేట 20 30 2,444
–––––––––––––––––––––––––––––––––––––––––––––––
మొత్తం 83 211 12,100
–––––––––––––––––––––––––––––––––––––––––––––––
రైతాంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి – మర్రి వెంకటయ్య , మాజీ ఎంపీపీ, నకిరేకల్
పంటలు ఎండిపోతున్న రైతాంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. ఆరుతడి పంటలైన కంది, వేరుశనగ, పెసర పంటలు వేసిన రైతులకు ఎకరాకు రూ.20వేలు నష్టపరిహారం ఇవ్వాలి. చెరువులు, కుంటలు కూడా చుక్కనీరు రాక వెలవెల బోతున్నాయి.
Advertisement
Advertisement