
మేడిన్ జపాన్.. అంతా తూచ్!
రాజధాని భవనాల డిజైన్‌పై ప్రభుత్వం పునరాలోచన!
♦ పరిశ్రమల్లోని పొగ గొట్టాల్లా అసెంబ్లీ భవనాలు
♦ ఛండీగఢ్ అసెంబ్లీని తలపిస్తున్న డిజైన్
♦ సర్వత్రా విమర్శలు.. సామాజిక మాధ్యమాల్లో సెటైర్ల హోరు
♦ అయోమయంలో సీఆర్‌డీఏ, రాష్ట్ర ప్రభుత్వం
♦ డిజైన్ మార్పుపై మల్లగుల్లాలు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని పరిపాలనా భవనాలకు ఎంపికైన జపాన్ కంపెనీ ఫుమిహికో మకి అసోసియేట్స్ డిజైన్‌పై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ డిజైన్ ఎంపికైనట్లు ఆర్భాటంగా ప్రకటించినా.. దీనిపై అధికారవర్గాల్లోనే అసంతృప్తి వ్యక్తమవడం, సామాజిక మాధ్యమాల్లోనూ పెద్దఎత్తున సెటైర్లు రావడంతో ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. డిజైన్‌లో రూపొందించిన అసెంబ్లీ భవనాలు పరిశ్రమల్లోని పొగగొట్టాల మాదిరిగా ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఛండీగఢ్ అసెంబ్లీ భవనం కూడా ఇంచుమించు ఇలాగే ఉండడంతో జపాన్ కంపెనీ కొత్తగా చేసిందేమిటనే ప్రశ్నలకు సమాధానం కరువైంది.
హైకోర్టు భవనం సైతం ఆకట్టుకునేలా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఆర్‌డీఏ మూడు నెలల పాటు హంగామా చేసి చివరికి ఇలాంటి డిజైన్ ఎంపిక చేయడం ఏమిటనే వాదన అధికారవర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం సీఆర్‌డీఏ దీనిపై ప్రజలు, నిపుణుల నుంచి సలహాలు స్వీకరిస్తోంది. ఈ దశలోనే డిజైన్‌ను మార్చితే ఎలా ఉంటుందనే దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.
మొత్తం డిజైన్‌నే మార్చేద్దామా..
పరిపాలనా భవనాల డిజైన్ల కోసం అంతర్జాతీయ ఆర్కిటెక్ట్‌లతో సీఆర్‌డీఏ పెద్ద వర్క్‌షాప్ నిర్వహించింది. ఆ తర్వాత తుది పోటీకి లండన్, ఇండియా, జపాన్‌లకు చెందిన మూడు ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ కంపెనీలను గుర్తించి వారి మధ్య పోటీ నిర్వహించింది. అసెంబ్లీ, హైకోర్టు భవనాలను ఐకానిక్ కట్టడాలుగా నిర్మించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం వాటి డిజైన్లు అత్యద్భుతంగా ఉండాలని ఆ కంపెనీలకు సూచించింది. ఈ మూడింటిలో ఒకదాన్ని ఎంపిక చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ ఆర్కిటెక్ట్‌లతో ఒక జ్యూరీని సైతం ఏర్పాటు చేసింది. క్రిస్టోఫర్ బెనిగర్ నేతృత్వంలోని ఈ జ్యూరీ లండన్‌కు చెందిన రిచర్డ్ రోజర్స్, ఇండియాకు చెందిన వాస్తు కన్సల్టెంట్స్ రూపొందించిన డిజైన్లను పక్కనపెట్టి జపాన్‌కు చెందిన మకి అసోసియేట్స్ డిజైన్‌ను ఎంపిక చేసింది. ప్రభుత్వం కూడా ఏ మాత్రం ఆలోచించకుండా దీనికి ఒకే చెప్పింది. ప్రభుత్వానికి భజన చేసే వారంతా డిజైన్ విడుదలైన మొదట్లో అత్యద్భుతంగా ఉందని కీర్తించినా.. ఆ తర్వాత నుంచి వాస్తవ విశ్లేషణలు మొదలయ్యాయి.
సోషల్ మీడియాలోనూ సెటైర్లు..
అలాగే సోషల్ మీడియాలోనూ ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను పట్టిందనే సెటైర్లు హోరెత్తుతున్నాయి. ఒప్పందం ప్రకారం రెండు ఐకానిక్ భవనాల పూర్తి స్థాయి డిజైన్లను పోటీలో గెలిచిన మకి అసోసియేట్స్ రూపొందించాల్సి ఉంది. కానీ అభ్యంతరాలు వ్యక్తమవుతుండడంతో సీఆర్‌డీఏ దీనిపై కొట్టుమిట్టాడుతోంది. ఐకానిక్ భవనాల డిజైన్లను మార్చాలా లేక మొత్తం 900 ఎకరాల పరిపాలనా భవనాల డిజైన్‌నే మార్చాలా అనే అంశంపై ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. నాలుగైదు నెలల పాటు బోలెడంత ప్రక్రియ నిర్వహించి.. రూ.కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత వాటిపై అభ్యంతరాలు వెల్లువెత్తడంతో ప్రభుత్వానికి, సీఆర్‌డీఏకు పాలుపోవడం లేదు.