ధర్మాగ్రహం
ధర్మాగ్రహం
Published Sat, Sep 10 2016 1:02 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
(సాక్షి ప్రతినిధి, అనంతపురం) : ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది. ప్యాకేజీ ద్వారా వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలకు మినహా రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రమూ ఉపయోగపడవని, అనంతపురం లాంటి వెనుకబడిన ప్రాంతాలకు ఇసుమంతైనా న్యాయం జరగదని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తుతోంది. ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టిన కేంద్రం, దాన్ని అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ నేడు (శనివారం) బంద్‌కు పిలుపునిచ్చింది. సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌తో పాటు వివిధ ప్రజాసంఘాలు ఈ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు కూడా బంద్‌లో పాల్గొననున్నారు.
‘అనంత’కు తీరని అన్యాయం
ప్రత్యేక హోదాకు, ప్యాకేజీకి చాలా తేడా ఉంది.Sహోదా ప్రకటిస్తే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. హోదా ఎన్నేళ్లు ఉంటుందో ఆ కాలంలో పరిశ్రమలకు ప్రత్యేక పన్ను రాయితీలు ఉంటాయి. కరెంటు సరఫరాలోనూ రాయితీ లభిస్తుంది. దీంతో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు దేశ,విదేశీ కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తాయి. బెంగళూరు విమానాశ్రయం, నేషనల్‌హైవే అందుబాటులో ఉన్న అనంతపురం జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. లక్షల ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. రవాణాకు అనుకూలంగా ఉంది. అవసరమైతే పుట్టపర్తి విమానాశ్రయాన్ని కూడా ప్రభుత్వం పూర్తిగా వినియోగంలోకి తేవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో విస్తీర్ణపరంగా అనంతపురం అతి పెద్ద జిల్లా. 41 లక్షల జనాభా ఉంది. ఇంతపెద్ద జిల్లాలో ప్రస్తుతం కనీసం వెయ్యిమందికి ఉద్యోగం కల్పించే పరిశ్రమ ఒక్కటీ లేదు. తాడిపత్రి పరిధిలోని అల్ట్రాటెక్‌లో 770, గెర్డావ్ స్టీల్ ఫ్యాక్టరీలో 500 మంది ఉన్నారు. పెన్నా–1(తలారిచెరువు)లో 200, పెన్నా–2(బోయిరెడ్డిపల్లి)లో 200 మంది ఉన్నారు. వీటిల్లో కూడా 90శాతం మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. ఈ పరిస్థితుల్లో హోదా ఇస్తే జిల్లాలో పదుల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటవుతాయి. లక్షలాదిమందికి ఉద్యోగాలతో పాటు ఉపాధి కూడా దొరుకుతుంది. పనికోసం కేరళ, కర్ణాటకకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. కానీ ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఒక్క పరిశ్రమ కూడా జిల్లాకు రాదు. ప్యాకేజీ రూపంలో కొన్ని సంస్థలు, నిధులను రాష్ట్రానికి కేంద్రం కేటాయిస్తుంది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా వినియోగిస్తుంది. అస్మదీయులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తుంది. కాబట్టి వ్యవసాయం కష్టంగా ఉన్న ‘అనంత’ లాంటి జిల్లాలకు ప్రత్యేక హోదానే అపర సంజీవని.
‘అనంత’కు ప్యాకేజీ చట్టంలో ఉన్న హక్కు
వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేకప్యాకేజీని ఇవ్వాలని విభజన చట్టంలో ఉంది. ఈ తరహా ప్యాకేజీకి రూ.3,200 కోట్లు ఇవ్వాలి. రాయలసీమకు ఇప్పటికే ప్యాకేజీ ప్రకటించారు. కాబట్టి కేంద్రం ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజీ వల్ల అదనపు ప్రయోజనం చేకూరదు. ప్రత్యేకSహోదాతో పాటు చట్టంలో ఉన్నట్లు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇచ్చేలా కేంద్రంపై రాష్ట్రం ఒత్తిడి తెస్తేనే ప్రయోజనం ఉంటుంది. కానీ కేంద్రం మాత్రం జిల్లాకు ఏడాదికి రూ.50కోట్ల చొప్పున రెండేళ్లలో రూ. వంద కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల్లోనూ జిల్లా యంత్రాంగం కేవలం రూ.18లక్షలు ఖర్చు చేసింది. ఈ ఏడాదికి సంబంధించి మరో రూ.50కోట్లు ప్రకటించింది. ఇలా చిల్లర రూపంలో కాకుండా ఒకేసారి బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ నిధులను విడుదల చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరముంది. ‘అనంత’కు హక్కుగా ప్యాకేజీ ఎలాగూ వస్తుంది కాబట్టి ప్రత్యేకహోదా తప్పనిసరిగా ఇచ్చి తీరాలని వైఎస్సార్‌సీపీ పట్టుబడుతోంది. దీని సాధన కోసం ఉద్యమిస్తోంది. ఇందులో భాగంగా విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలు ఆందోళనలు చేశారు. ఇప్పుడు మరోసారి క్షేత్రస్థాయి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
బంద్ భగ్నానికి కుట్ర!
వైఎస్సార్‌సీపీ తలపెట్టిన బంద్‌ను భగ్నం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 30 పోలీస్‌యాక్ట్‌ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం జనం ఒకే చోట గుమిగూడరాదని, ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు చేపట్టరాదని జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Advertisement
Advertisement