ప్రజాప్రయోజనాల కోసమే ‘బంద్’
-
టీడీపీ, బీజేపీ రెండూ రాష్ట్ర ప్రజలను మోసం చేశాయి.
-
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి
-
రేపు బంద్‌కు పిలుపునిచ్చిన వైఎస్సార్ సీపీ
నెల్లూరు(సెంట్రల్) : రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు మంగళవారం బంద్ చేపడుతున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాకాణి మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, ఆ పార్టీతో అంటకాగుతున్న సీఎం చంద్రబాబు వైఖరికి నిరసనగా మంగళవారం రాష్ట్ర బంద్‌ను చేపడుతున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, బీజేపీతో లాలూచీ పడి ప్రత్యేక హోదాపై నిలదీయడం లేదని విమర్శించారు. హోదా అనేది సంజీవిని కాదు అంటూ బాబు బహిరంగంగానే వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనమన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల అవసరాల దృష్ట్యా ప్రత్యేక హోదా కోసం ఎన్నో పోరాటాలు చేశారని, చంద్రబాబు ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. లోక్‌సభ, రాజ్యసభలలో టీడీపీ ఎంపీల చేత ఆయన డ్రామాలు ఆడిస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యసభలో చర్చ జరుగుతున్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్, ప్రస్తుత పీఎం నరేంద్రమోది సైతం సభలో లేకపోవడం చూస్తుంటే మన రాష్ట్రంపై వారికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నరేంద్ర మోది, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు తప్పారని విమర్శించారు. హోదా విషయం వచ్చే సరికి అనేక సాకులు చెపుతుండటం అన్యాయమన్నారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పుడెంత అవసరమో అందరికీ తెలుసునన్నారు. హోదా సాధించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడానికే బంద్‌ను చేపడుతున్నట్లు కాకాణి వివరించారు.
కమ్యూనిస్టు నాయకులతో చర్చ
ప్రత్యేక హోదా విషయంలో మంగళవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బంద్ చేపడుతున్న నేపధ్యంలో ఆదివారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గూడూరు సమన్వయ కర్త మేరిగ మురళి, సీఈజీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, ఫ్లోర్ లీడర్ పి.రూప్‌కుమార్ యాదవ్, శ్రావణ్‌లతో కలసి సీపీఎం కార్యాలయానికి వెళ్లారు. సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు చండ్ర రాజగోపాల్, పార్థసారథి, జక్కా వెంకయ్య, పముజుల దశరథరామయ్య, మాదాల వెంకటేశ్వర్లు, మూలం రమేష్, మోహన్‌రావులతో బంద్ విషయంపై చర్చించి కలసి రావాలని కోరారు.