‘ధృవ’ చిచ్చు
-
పార్టీల విషయంలో రెండు వర్గాలుగా చీలిన చిరు యువత
-
సినిమా టికెట్ల విషయంలో పోట్లాట
-
సిరి థియేటర్‌లో పంచాయతీ
-
పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ వర్గం
నెల్లూరు సిటీ: సినీ నటుడు చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తేజ నటించిన ధృవ సినిమా చిరంజీవి యువతలోని రెండు వర్గాల మధ్యన చిచ్చు రేపింది. పార్టీల నేపథ్యంలో చిరంజీవి యువత రెండు వర్గాలుగా విడిపోయి టికెట్ల విషయంలో తరచూ గొడవపడుతున్న విషయం తెలిసిందే. నగరంలోని సిరి థియేటర్‌లో ఈ నెల 9న ధృవ సినిమా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి యువతలోని ఓ వర్గం థియేటర్ వద్దకు చేరుకుని యాజమాన్యంతో తమ వాటా టికెట్లు ఇవ్వాలని కోరింది. దీంతో మేనేజర్ శ్రీనివాసులు చిరంజీవి యువత నాయకులు తమకు ఇవ్వాల్సిన టికెట్లను తీసిòపెట్టాలని చెప్పారని, ఇన్ని వర్గాలు వస్తే తాము టికెట్లు ఇవ్వలేమని తెలిపారు. దీంతో ఆ వర్గం తమకు రావాల్సిన 30శాతం టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో యాజమాన్యం చిరంజీవి యువత అధ్యక్షుడు కొట్టే వెంకటేశ్వర్లు, రవి, కృష్ణారెడ్డికు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. దీంతో మరో వర్గం థియేటర్ వద్దకు చేరుకుంది. కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టీలోకి వెళ్లిన వారికి టికెట్లు ఇవ్వవద్దని చెప్పడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. థియేటర్ యాజమాన్యం జోక్యం చేసుకోవడంతో వివాదం సమసింది.
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు...
తమకు రావాల్సిన టికెట్లు ఇవ్వడం లేదని, అభిమానులకు టికెట్లు దక్కకుండా చూస్తున్నారని ఓ వర్గం నాయకులు సుజయ్‌బాబు, చక్రవర్దన్‌రెడ్డి, సనత్, వెంకటరమణ, మదన్ మూడో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు టికెట్ల పంపకాలు నిలిపివేయాలని థియేటర్ యాజమాన్యాన్ని ఆదేశించారు.