హీరో గ్లామర్.. ప్రముఖ టూవీలర్ ‘హీరో’ బ్రాండ్స్..
సాక్షి, సిటీబ్యూరో: వ్యక్తిగానో, వ్యవస్థగానో నమ్మకాన్ని పొందాలంటే సంవత్సరాల తరబడి నిరంతరం శ్రమిస్తూనే ఉండాలని, ఆ నమ్మకమే విజయానికి గీటురాయి అని గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ అన్నారు. 40 ఏళ్లకు పైగా హీరోగా ప్రజాదరణ పొందుతున్న తన తండ్రి చిరంజీవి, ప్రముఖ టూవీలర్ ‘హీరో’ బ్రాండ్స్ ఈ నమ్మకానికి నిదర్శనమన్నారు. హీరో మోటోకార్ప్ ఆధ్వర్యంలో నగరంలోని హోటల్ నోవోటెల్ వేదికగా గురువారం న్యూ ఒరిజినల్ గ్లామర్ బైక్ ఆవిష్కరించారు.సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రంజీవ్ జీత్ సింగ్‌తో పాటు హీరో బ్రాండ్ అంబాసిడర్ రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా గ్లామర్ బైక్‌ను ఆవిష్కరించారు. 1984లో ప్రారంభమైన హీరో సంస్థ 40 ఏళ్ల పాటు కస్టమర్ల మన్ననలు పొందుతుందని, ఆ కస్టమర్లే తమ సంస్థకు హీరోలని రంజీవ్ జీత్ సింగ్ అన్నారు. ముఖ్యంగా 19 ఏళ్ల పాటుగా గ్లామర్ బైక్ అందరికీ ఫేవరెట్ బైక్‌గా 80 లక్షల కస్టమర్ల మనసులను చూరగొందని అన్నారు. అనంతరం రామ్ చరణ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. ఆమె అభిమానం నా బాధ్యతను పెంచింది..ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లో భాగంగా జపాన్ వెళ్లిన సమయంలో దాదాపు 70 ఏళ్ల మహిళ 180 పేజీల ఆర్ట్ వర్క్ బుక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. అది తెరచి చూస్తే నా గత సినిమాల్లోని కొన్ని స్టిల్స్‌ని ఆర్ట్‌గా వేశారు. ఇలాంటి అభిమానం నా బాధ్యతను మరింతగా పెంచింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావడం అందులో ఒకటి. నాటు నాటు పాటలోని కొన్ని నిమిషాల స్టెప్ కోసం తారక్, నేను దాదాపు 30 రోజులకు పైగా కష్టపడ్డాం. ఈ కష్టం ఆస్కార్‌తో పాటు ప్రపంచ వ్యాప్త అభిమానులను అందించింది.బైక్స్ అంటే ఇష్టం.. చిన్నప్పటి నుంచీ బైక్ అంటే ఇష్టం. కానీ నాన్న బైక్‌లకు అంతగా ప్రోత్సహించేవారు కాదు. అందుకే నాన్నకు తెలియకుండా ఫ్రెండ్స్ హీరో బైక్స్ నడిపేవాడిని. ఇప్పుడు అదే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం గొప్ప అనుభూతినిస్తుంది. ప్రస్తుతం గుర్రాలన్నా, హార్స్ రైడింగ్ అన్నా చాలా ఇష్టం. ఎంతలా అంటే మగధీర సినిమాలో షూట్ చేసిన గుర్రం విపరీతంగా నచి్చ, షూట్ తరువాత దర్శకులు రాజమౌళితో మాట్లాడి ఆ గుర్రాన్ని నేనే తీసుకున్నా. ఈ మధ్యనే ఆ గుర్రం మరో గుర్రానికి జన్మనిచి్చంది. దానిని నా కూతురు క్లీంకారాకు గిఫ్ట్‌గా ఇచ్చాను. ప్రస్తుతం నా దగ్గర 15 గుర్రాలు ఉన్నాయి. తన కోసమే పక్షులు కొన్నా.. జంతువులంటే నాకు చాలా ఇష్టం. నా కూతరు ఇష్టంగా ఆహారం తినడం కోసమే కొన్ని రకాల పక్షులను కొన్నాను. వాటిని చూపిస్తూ రోజూ ఆహారం తినిపిస్తాం. క్లీంకారా అనే నా కూతురు పేరును సంస్కృత భాషలోని లలిత సహస్ర నామం నుంచి ఎంచుకున్నాం. ఇక సినిమాలు ఎన్నో మరచిపోలేని అనుభూతులతో పాటు బాధ్యతను పెంచాయి. నేనో నిత్య విద్యార్థిని..నా సినిమాల్లో రంగస్థలం, ఆరెంజ్, మగ«దీర సినిమాలు చాలా ఇష్టం. యాక్షన్ సినిమాలు చేయడం ఇష్టం, త్వరలో బుచి్చబాబు దర్శకత్వంలో మంచి కామెడీ సినిమాను చేస్తున్నాను. ఆర్ఆర్ఆర్ ప్రయాణంలో రాజమౌళి కీలకం. తనతో షూటింగ్ అంటే స్కూల్‌కు వెళ్లే విద్యారి్థలా నేర్చుకోవడానికి వెళతాను. నాన్న నుంచి నేర్చుకున్న జీవిత సూత్రాలు తప్పకుండా పాటిస్తాను. మన ప్రయాణంలో భాగమైన ఆతీ్మయులను, సిబ్బందినీ మర్చిపోవద్దని చెప్పేవారు. అందుకే 15 ఏళ్లకు పైగా నా సిబ్బందిని మార్చకుండా నా దగ్గరే ఉండేలా చూసుకుంటున్నా.. మోస్ట్ మెమొరబుల్ మూమెంట్.. స్పోర్ట్స్‌తో ఎంగేజ్ అవ్వడం కన్నా పుస్తకాలు చదవడం ఇష్టం. నటన పరంగా తమిళహీరో సూర్య, సమంతాలను బాగా ఇష్టపడతాను. క్లీంకారా జన్మించిన సందర్భం జీవితంలో అత్యంత అనుభూతికి లోనయ్యాను. మోస్ట్ మెమొరబుల్ మూమెంట్..!! నార్త్ ఇండియా అన్నా.. ముఖ్యంగా రాజస్థాన్, హిమాలయాలు ఫేవరెట్ స్పాట్స్. నా గురించి సింపుల్‌గా ఒక్కమాటలో చెప్పాలంటే.. రామ్ చరణ్ అంటే మిత భాషికుడు, స్నేహితులకు దగ్గరగా ఉండేవాడు, ముఖ్యంగా హోమ్ బాయ్.