ఆర్టీసీపై 'డిజిల్' బాదుడు
– ధరను పెంచిన కేంద్ర ప్రభుత్వం
– ఆర్టీసీపై ఏటా రూ.5.04కోట్లకు పైగా అదనపు భారం
కర్నూలు(రాజ్‌విహార్): డీజిల్ ధరల పెంపు రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)పై పిడుగు పడినట్టైంది. ఇప్పటికే ఆ సంస్థ పీకల్లోతు ఇబ్బందుల్లో ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలు పెంచడంతో ఆ సంస్థపై మరింత భారం వేసినట్టైంది. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌పై ట్యాక్సుల రూపంలో రూ.4పెంచిన విషయం తెలిసిందే. దీనికి తోడు కేంద్ర ప్రభుతం అడపాదడపా డీజిల్ ధరలు పెంచుతూ వస్తోంది. తాజాగా లీటర్‌పై రూ.2.30 పెంచిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానుంది. దీంతో లీటర్ డీజిల్ ధర రూ. 60.32పైసలవుతోంది.
కర్నూలు రీజియన్ (జిల్లా)లోని 11డిపోల్లోని 1016 బస్సుల్లో 226 అద్దె, 790 సంస్థకు చెందిన బస్సులున్నాయి. అద్దె బస్సులు మినహా సంస్థ బస్సుల నిర్వహణ, డీజిల్ కొనుగోలు అంతా ఆర్టీసీదే. ఇవి రోజుకు దాదాపు 3.80లక్షల కిలో మీటర్లు తిరిగి 3.90లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేస్తున్నాయి. వీటికి రోజుకు 60వేల లీటర్లకుపైగా డీజిల్ అవసరం. పెరిగిన ధరలతో రోజుకు రూ. 1.38 లక్షలకు పైగా అదనపు భారం పడగా నెలకు రూ.41.40లక్షల వరకు అవుతుంది. ఈలెక్కన ఏడాదికి 2.19కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తుండడంతో సంస్థపై రూ. 5.04 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. అంతేకాక శ్రీశైలం బ్రహ్మోత్సవాలు, ఉగాది, అహోబిలం, ఉరుకుంద జాతర, సంక్రాంతి తదితర సందర్భాల్లో ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఇతర జిల్లాల నుంచి బస్సులు తెప్తిసారు. వీటికి కొనుగోలు చేసే డీజిల్ భారం మోయాల్సి వస్తోంది. ఈనష్టాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టామని డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ రమేష్‌కుమార్ పేర్కొన్నారు.