న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2023 అక్టోబర్ 1–15 మధ్య పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పడిపోయాయి. ప్రభుత్వ రంగంలోని మూడు చమురు సంస్థల గణాంకాల ప్రకారం.. గతేడాది అక్టోబర్ 1–15తో పోలిస్తే ఈ నెల తొలి అర్ధ భాగంలో పెట్రోల్ విక్రయాలు 9 శాతం క్షీణించి 1.17 మిలియన్ టన్నులుగా ఉంది. డీజిల్ అమ్మకాలు 3.2 శాతం తగ్గి 2.99 మిలియన్ టన్నులకు వచ్చి చేరింది. 2022 అక్టోబర్‌లో దుర్గా పూజ/దసరా, దీపావళి ఒకే నెలలో రావడంతో పెట్రోల్, డీజిల్ వినియోగం అధికంగా ఉంది.
2023 సెప్టెంబర్ 1–15తో పోలిస్తే ఈ నెల 1–15 మధ్య పెట్రోల్ విక్రయాలు 9 శాతం తగ్గాయి. డీజిల్ అమ్మకాలు మాత్రం 9.6 శాతం ఎగశాయి. 2022 అక్టోబర్‌తో పోలిస్తే ఈ నెల అర్ధ భాగంలో విమాన ఇంధన డిమాండ్ 5.7 శాతం దూసుకెళ్లి 2,95,200 టన్నులు నమోదైంది.
నెలవారీగా పెరుగుతూ..
నీటి పారుదల, సాగు, రవాణా కోసం ఇంధనాన్ని ఉపయోగించే వ్యవసాయ రంగంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో డీజిల్ అమ్మకాలు సాధారణంగా రుతుపవన నెలలలో క్షీణిస్తాయి. అలాగే వర్షం కురిస్తే వాహనాల రాకపోకలు మందగిస్తాయి. దీంతో గత మూడు నెలల్లో డీజిల్ వినియోగం తగ్గింది. రుతుపవనాలు ముగిసిన తర్వాత వినియోగం నెలవారీగా పెరిగింది.
2023 అక్టోబర్ 1–15 మధ్య పెట్రోల్ వినియోగం 2021 అక్టోబర్‌తో పోలిస్తే 12 శాతం, 2019 అక్టోబర్‌తో పోలిస్తే 21.7 శాతం పెరిగింది. అలాగే డీజిల్ వాడకం 2021 అక్టోబర్‌తో పోలిస్తే 23.4 శాతం, 2019 అక్టోబర్‌తో పోలిస్తే 23.1 శాతం అధికమైంది. విమాన ఇంధన వినియోగం 2021 అక్టోబర్‌తో పోలిస్తే 36.5 శాతం అధికంగా, 2019 అక్టోబర్‌తో పోలిస్తే 6.6 శాతం తక్కువ నమోదైంది. వంటకు ఉపయోగించే ఎల్‌పీజీ విక్రయాలు 1.2 శాతం పెరిగి 1.25 మిలియన్ టన్నులుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment