ఉదయం 11 గంటల వరకు పతాకావిష్కరణ జరగని చినబొండపల్లి పంచాయతీ కార్యాలయం
జెండా ఆవిష్కరణపై జీవోతో గందరగోళం
సర్పంచ్‌లు, ఎంపీటీసీల మధ్య విభేదాలు
కొన్నిచోట్ల ఎగరని మువ్వన్నెల జెండా
పార్వతీపురం రూరల్, బలిజిపేట రూరల్: విభేదాలతో పంద్రాగస్టు వేడుకలకు కళంకం తీసుకొచ్చారు. పతాకావిష్కరణ జగడంతో స్వాతంత్య్ర దినోత్సవాన్ని విస్మరించారు. మండలంలోని చాలా గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలల్లో సోమవారం మువ్వన్నెల పతాకం రెపరెపలాడలేదు. ఈ ఏడాది సర్పంచ్‌లు కేవలం పంచాయతీ కార్యాలయాల్లోనే జెండా ఎగురవేయాలని, మండల పరిషత్ ప్రాథమిక, జెడ్పీ ఉన్నత పాఠశాల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు జెండా ఎగురవేయాలని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇది వారిమధ్య పొరపొచ్చాలకు కారణమైంది. చాలా గ్రామాల్లో ఎంపీటీసీలు జెండా ఎగరేసిన చోట సర్పంచ్‌లు, సర్పంచ్‌లు జెండా ఎగరేస్తే ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు. చినబొండపల్లి పంచాయతీ కార్యాలయంలో ఉదయం 11గంటల వరకు జెండా పండగ ఊసే లేదు. పూర్తిగా కార్యాలయం తలుపులు మూసివున్నాయి. ఇది తెలుసుకున్న ఎంపీడీవో కెల్ల కష్ణారావు వెంటనే సర్పంచ్ బోను దేవీచంద్రమౌళి, కార్యదర్శులతో ఫోన్లో మాట్లాడి జెండా ఎగరేయాలని ఆదేశించడంతో ఎట్టకేలకు మధ్యాహ్నం 12 గంటలకు జెండాను పతాకావిష్కరణ అయిందనిపించారు. ఇలా పతాకావిష్కరణ జరగని పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలు ఎన్నో ఉన్నాయి.
ప్రొటోకాల్‌కు మంగళం
ప్రాథమిక పాఠశాలల వద్ద సర్పంచ్‌ల స్థానంలో ఎంపీటీసీలు పతాకావిష్కరణ చేసేందుకు అనుమతులు ఇచ్చినా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మంగళం పాడారు. బలిజిపేట మండలం పెద్దింపేట పంచాయతీ పరిధిలోని గౌరీపురం పాఠశాలలో పతాకావిష్కరణకు ఆహ్వానాలందుకున్న సర్పంచ్ కురిటి వెంకటినాయుడు, ఎంపీటీసీ టి.తవిటినాయుడు హాజరయ్యారు. కొత్త నిబందనల ప్రకారం ఎంపీటీసీతో పతాకావిష్కరణ చేయించాల్సి ఉంది. కానీ ప్రధానోపాధ్యాయుడు శంకరరావు ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి ముందు సర్పంచ్ వెంకటినాయుడిని ఆహ్వానించి పతాకావిష్కరణ చేయించి, అనంతరం ఎంపీటీసీని ఆహ్వానించారు. ప్రధానోపాధ్యాయుడు శంకరరావును వివరణ కోరగా స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ఇద్దరితో పతాకావిష్కరణ చేయించానని తెలిపారు. ఎంపీటీసీ తవిటినాయుడిని వివరణ కోరగా తనతో పతాకావిష్కరణ చేయించాల్సి ఉందన్నారు. కానీ ప్రధానోపాధ్యాయుడు ముందుగా సర్పంచ్ వెంకటినాయుడిని ఆహ్వానించి అనంతరం తనను ఆహ్వానించారని తెలిపారు.