దుబ్బాకటౌన్: తొలితరం కమ్యూనిస్టునేతగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సోలిపేట రామచంద్రారెడ్డిని 70 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు వరించాయి. మట్టిమనుషులతో కలిసి తిరిగిన జమీన్ లీడర్‌గా ఆయనకు గుర్తింపు ఉంది. ప్రజల మేలు కోసం పరితపించే సిసలైన నాయకుడు. స్థానిక సంస్థల దగ్గరి నుంచి విదేశీ విధానాల వరకు ప్రత్యక్ష అవగాహన కలిగిన నేతగా పేరుంది. ఇప్పుడు గొప్పగా చెప్పకుంటున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు, నూతనచట్టాలపై కొన్ని దశాబ్దాల కిత్రమే రామచంద్రారెడ్డి ఎలుగెత్తి చాటిన విషయం చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. రామచంద్రారెడ్డి అనార్యోగంతో హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం మృతి చెందారు. దీంతో ఆయన స్వగ్రామమైన చిట్టాపూర్‌తోపాటు, ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
● ఎమ్మెల్యేగా పనిచేసే కాలంలోనే రామచంద్రారెడ్డి దొమ్మాట నియోజకవర్గపరిధిలో వ్యవసాయం, రోడ్ల అభివృద్ధికి విశేష కృషి చేశారు. రాజ్యసభ సభ్యుడిగా కూడవెల్లివాగుపై చెక్ డ్యాంలు నిర్మించేందుకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేయించారు.
● రామచంద్రారెడ్డి వాలీబాల్ ప్లేయర్. బాల్యంలో తోటి స్నేహితులతో కలిసి వాలీబాల్ బాగా ఆడేవారని చిట్టాపూర్‌వాసులు గుర్తుచేసుకుంటు న్నారు.
● పుస్తక పఠనం ఆయనకు ఎంతో ఇష్టం. వారంలో నాలుగు రోజులు లైబ్రరీలో గడిపేవారు. ఎనిమిదిపదుల వయస్సులోనూ రోజు నాలుౖ గెదు దినపత్రికలు చదివేవారు. సాహిత్య కార్య క్రమాలకు ఎవరు ఆహ్వానించినా తప్పకుండా వెళ్లేవారు.
సొంతూరి నుంచే...
దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో మాలిపటేల్ సోలిపేట గాలిరెడ్డి– సుందరమ్మ దంపతులకు 1935లో రామచంద్రారెడ్డి జన్మించారు. సొంతూరిలోనే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఆపై సిద్దిపేటలో పదోతరగతి వరకు చదివారు. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్ సిటీకాలేజీలో చదివారు. ఈ సమయంలోనే 1951లో సిటీ కాలేజీకి స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా గెలుపొందారు. అప్పుడే జరిగిన పరిణామాలతో అతడిలో కమ్యూనిజం బీజాలు మొలకెత్తాయి. దీంతో చదువుకు స్వస్తి చెప్పి స్వగ్రామానికి వచ్చాడు.
● చిట్టాపూర్ మొట్టమొదటిసర్పంచ్‌గా 1955లో ఎన్నికై 1964 వరకు అదే పదవిలో కొనసాగారు.
● 1964 నుంచి దుబ్బాక సమితి ప్రెసిడెంట్‌గా, 1970–72 వరకు సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు.
● 1972లో దొమ్మాట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు.
● 1978 నుంచి మెదక్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్‌గా పనిచేశారు.
● 1988 –89లో ఎన్‌టీఆర్ ప్రభుత్వంలో ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు.
● 1996 నుంచి 2002 వరకు రాజ్యసభ సభ్యు డిగా, రాజ్యసభలో టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా, రాజ్య సభ అస్సూరెన్స్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు.
● ఉమ్మడి మెదక్‌కు కాంగ్రెస్, టీడీపీల తరఫున పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.
● ఇండియా –చైనా మిత్రమండలి అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు.
● సీఆర్ ఫౌండేషన్ తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టుతో ఇతర సంస్థలకు సభ్యుడిగా సేవలు అందించారు.
● లోక్‌సత్తాలో సైతం పనిచేసి అనేక ఉద్యమాలకు నేతృత్వం వహించారు.
● గత కొన్నేళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
● మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో మొదలుకొని, మాజీ సీఎంలు చెన్నారెడ్డి, ఎన్‌టీఆర్, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు నెరిపారు.
నక్సల్స్ ఇంటిని పేల్చడంతో కలత
ప్రగతిశీల వామపక్ష భావాలతో ఉండే రామచంద్రారెడ్డి గ్రామంలోని దళితులు, వెనుకబడిన కులాల వారిని ఎంతగానో ప్రోత్సహించారు. గ్రామంలో సమానత్వం తీసుకొచ్చే సమయంలోనే నక్సలైట్ ఉద్యమం మొదలైంది. అప్పటికే జిల్లాలో చాలా నక్సలైట్ గ్రూపులు ఉండేవి. భూస్వాములు, రాజకీయ నేతలను టార్గెట్ చేసి వారి ఇళ్లు పేల్చేవారు. 1997లో రామచంద్రారెడ్డి పుట్టిపెరిగిన ఇంటిని నక్సలైట్లు పేల్చివేయడంతో తీవ్రంగా కలత చెందాడు. దీంతో కొంతకాలం ఆయన స్వగ్రామానికి వెళ్లేందుకు కూడా ఇష్టపడలేదు. నక్సలైట్ల దాడిలో ఇంట్లోని విలువైన ఫొటోలు, పుస్తకాలు, చిన్నతనంలోని జ్ఞాపకాలు కాలి బూడిద అయ్యాయని చాలా బాధపడ్డారు. పేదలు, ఎస్సీలు కోసం తనకున్న 20 ఎకరాలకు పైగా భూమి ఇస్తే..నక్సల్స్ ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. దీనికి అప్పుడు నక్సల్ వివరణ ఇస్తూ రామచంద్రారెడ్డి టీడీపీలో ఉన్నందునే ఇంటిని పేల్చామన్నారు.
సినారెతో బంధుత్వం
ప్రముఖకవి, రచయిత డాక్టర్ సి.నారాయణరెడ్డితో రామచంద్రారెడ్డికి దగ్గరి బంధుత్వం ఉంది. రామచంద్రారెడ్డి అమ్మమ్మ ఊరు మరిగడ్డ, సినారే స్వగ్రామం హన్మాజీపేట పక్కపక్క గ్రామాలే. ఇస్కస్ తదితర అభ్యుదయ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వీరిద్దరికి మంచి పరిచయం ఉంది. ఈ క్రమంలోనే 1986లో సినారే నాలుగో కుమార్తె కృష్ణవేణిని రామచందారెడ్డి పెద్ద కుమారుడు (రాష్ట్ర గ్రామీణ బ్యాంకుల అసోషియేషన్ అధ్యక్షుడు) వెంకటేశ్వర్‌రెడ్డికి ఇచ్చి వివాహం చేయడంతో ఇద్దరు వియ్యం అందుకున్నారు.1996 నుంచి 2002 వరకు రామచంద్రారెడ్డి, సినారె ఒకే సమయంలో రాజ్యసభ సభ్యులుగా కొనసాగడం మరో విశేషం.
కేసీఆర్‌కు రాజకీయగురువు
ప్రస్తుత సీఎం కేసీఆర్‌కు రామచంద్రారెడ్డి రాజకీయ గురువు. సీఎం స్వగ్రామమైన చింతమడక దుబ్బాక సమితి పరిధిలోనే ఉండేది. సమితి ప్రెసిడెంట్ నుంచి ఎమ్మెల్యేగా రామచంద్రారెడ్డి గెలుపొందినప్పటి నుంచి కేసీఆర్ తరచు కలిసేవారు. 1988లో టీడీపీ నాయకులకు రామచంద్రారెడ్డి నేతృత్వంలో రాజకీయ శిక్షణ తరగతులు జరిగాయి.
దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి రామచంద్రారెడ్డి వరుసకు సోదరుడు అవుతాడు. రామలింగారెడ్డి, రామచంద్రారెడ్డిల తాతలు అన్నదమ్ముళ్లు. రామలింగారెడ్డి మృతి చెందినప్పుడు చిట్టాపూర్‌కు వచ్చి రామచంద్రారెడ్డి కంటతడి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment