అనంతపురం అర్బన్ : హంద్రీ-నీవా ద్వారా నిర్ధేశిత 3.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు అవసరమైన డిస్ట్రిబ్యూటరీ పనులు వెంటనే చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్, ఇతర నాయకులు విన్నవించారు. మంగళవారం జిల్లాకు విచ్చేసిన మంత్రిని స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో కలిసి వినతిపత్రం అందజేసి పరిస్థితి వివరించారు. హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు.
ఈ పనులు పూర్తి ప్రభుత్వం మూడు నెలలు గడువు విధించిందని, పనులు ఇలా సాగితే ఆరునెలలైనా పూర్తి కావన్నారు. పనులు జాప్యంతో జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల తరహాలో పనులు చేపట్టి వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో సీపీఐ నాయకులు సి.జాఫర్, శ్రీరాములు, కేశవరెడ్డి, తదితరులు ఉన్నారు.