జిల్లా ఆసుపత్రి ఇక ప్రైవేట్!
– సీఎం గ్రీన్ సిగ్నల్
– ధ్రువీకరించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వైస్ చైర్మన్
- ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో అసంతృప్తి
నంద్యాల: చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో యాజమాన్యానికి అప్పగించినట్లే రూ.90కోట్ల విలువైన స్థానిక ఏపీ వైద్య విధాన పరిషత్ జిల్లా స్థాయి ఆసుపత్రిని కూడా ప్రైవేటు పరం చేయనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ సీఎల్ వెంకటరావు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో జీఓ కూడా విడుదల కావచ్చని సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసుపత్రులను ప్రైవేటు పరం చేసేందుకు ఏడాదిన్నర క్రితమే ప్రతిపాదనలు రూపొందించింది. ఇందులో భాగంగా రెండేళ్ల క్రితం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీఓ నెం.125, 14–10–2015) అపోలోకు అప్పగించింది. తర్వాత రాష్ట్రంలోని 9 జిల్లా స్థాయి ఆసుపత్రులను ప్రైవేటు పరం చేయాలని ప్రతిపాదనలు తయారు చేసింది. ఇందులో నంద్యాలలోని జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి ఒకటి. విపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత వస్తుందని ఆ ప్రతిపాదనలను కొంత కాలం పెండింగ్ పెట్టారు. మళ్లీ ఆ ప్రతిపాదనను ఇటీవల వెలుగులోకి తీసుకొచ్చారు.
స్పష్టం చేసిన స్వచ్చాంధ్ర కార్పొరేషన్ వైస్ చైర్మన్
రాష్ట్రంలోని 8 జిల్లా ఆసుపత్రులను ప్రైవేటుపరం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ సీఎల్ వెంకటరావు ప్రకటించారు. ఆయన రెండు రోజుల క్రితం అమరావతిలో జరిగిన ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు, ప్రైవేటు అసోసియేషన్ల సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని నంద్యాలతో సహా 9 జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటుకు ఇవ్వనున్నారని, ఇకపై పీపీపీ పద్ధతిలో వైద్య సేవలు అందుతాయని చెప్పారు. దీనిపై జనవరిలో ప్రభుత్వం జీఓ జారీ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి
రూ.90కోట్ల ఆస్తి ప్రైవేటు చేతిలోకి..
బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో 200 పడకలు, మాతాశిశు సంరక్షణ కేంద్రంలో 150 పడకలు ఉన్నాయి. ఆసుపత్రికి రూ.7.35ఎకరాల స్థలం ఉంది. మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.70కోట్లు పైమాటే. ఆసుపత్రి భవనం, పరికరాలు, దాదాపు రూ.20కోట్లకు పైగా విలువ చేసే అవకాశం ఉంది. అంతటి విలువైన ఆసుపత్రిని ప్రైవేటు సంస్థకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంకావడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.