కలవరపెడుతున్న రోడ్డు ప్రమాదాలు
♦ పది రోజుల్లో ఐదుగురి మృత్యువాత
♦ కనిపించని హెచ్చరిక బోర్డులు
♦ పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు
యాలాల: రోడ్డు ప్రమాదాలు కలవరానికి గురిచేస్తున్నాయి. మండల పరిధిలో పది రోజుల్లో జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. మృతుల కుటుంబీకుల్లో కొందరు పెద్ద దిక్కును కోల్పోగా, మరికొంతమంది జీవనాధారాన్ని కోల్పోయారు. ఇంకొందరి చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసిన పాపాన పోవడం లేదు. మండల పరిధిలో తాండూరు- కొడంగల్ అంతర్ జిల్లా రహదారి ఉంది. తాండూరు నుంచి కొడంగల్ వరకు 18 కి.మీ. దూరం ఉండగా, మండల పరిధిలో సుమారు 12 కి.మీ. వరకు ఉంది. దౌలాపూర్, తిమ్మాయిపల్లి, బండమీదిపల్లి, తాండూరు కాగ్నా బ్రిడ్జి సమీపంలో మూల మలుపులు ఉన్నాయి. దీనికితోడు మధ్యలో హెచ్చరిక బోర్డులు లేని కల్వర్టులు, స్పీడ్ బ్రేకర్లు చాలానే ఉన్నాయి.
గతనెల 30న రాత్రివేళ ఆగిఉన్న లారీని బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు కర్ణాటకవాసులు మృతి చెందారు. ఈ సంఘటన జరిగిన ప్రదేశంలో ఓ కల్వర్టు ఉంది. ఇక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డు లేకపోవడంతో రాత్రి పూట గమనించని వారు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటన జరిగిన సరిగ్గా పది రోజుల తరువాత ఎలాంటి హెచ్చరిక బోర్డు లేని ఇరుకు కల్వర్టు వద్ద శనివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. తాండూరు-హైదరాబాద్ ప్రధాన మార్గం కావడంతో ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. శనివారం రాత్రి ఓ పాదచారుడిని బైక్ ఢీకొన్న ఘటనలో మృతిచెందిన సంఘటన అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. ఇన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న ఆర్అండ్‌బీ అధికారులు ఆయా ప్రాంతాల్లో సూచిక, హెచ్చరిక బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
గుంతలో పడి గాయాలపాలవుతున్నా..
తాండూరు-కొడంగల్ ప్రధాన రోడ్డుపై గుంత ఏర్పడి నెల రోజులు గడుస్తున్నా ఆర్‌అండ్‌బీ అధికారుల పట్టించుకోవడం లేదు. మండలంలోని దౌలాపూర్ సబ్‌స్టేషన్ సమీపంలోని మూలమలుపు వద్ద ఓ గుంత ఏర్పడింది. మలుపులో గుంత ఉండడంతో గమనించని చాలామంది ద్విచక్రవాహనదారులు కిందపడి గాయాలపాలయ్యారు. ఈ విషయమై ఇటీవల ఓ ప్రొబెషనరీ ఎస్‌ఐ స్వయంగా ఆర్‌అండ్‌బీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న కల్వర్టులు, డేంజర్ జోన్లు, మూలమలుపుల వద్ద రేడియంతో కూడిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.