
'రంగారెడ్డి జిల్లాను రెండుగా విభజిస్తాం'
శేరిలింగంపల్లి: రంగారెడ్డి జిల్లాను రెండుగా విభజిస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా పెద్దగా ఉన్నందున ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఈస్ట్ (తూర్పు), వెస్ట్ (పడమర)లుగా రెండుగా విభజించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్తానన్నారు. 30 రోజుల్లో అన్ని కార్యాలయాలను తనిఖీ చేసి రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు రెవెన్యూ విభాగంలో కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు.