డివిజన్‌.. డీల్‌ | Division .. Deal | Sakshi
Sakshi News home page

డివిజన్‌.. డీల్‌

Published Wed, Jul 27 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

మాట్లాడుతున్న ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌

మాట్లాడుతున్న ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌

  • ఆగస్టు 10న కౌన్సిల్‌కు నిర్ణయం
  • ప్రతీ డివిజన్‌కు రూ.30లక్షల నుంచి రూ.50లక్షలకు పెంపు
  • మూడు నెలలకోసారి రూ.లక్ష అత్యవసర నిధులు
  • పాత పనులకు నో చెప్పిన కార్పొరేటర్లు
  • అధికారులు, కార్పొరేటర్లతో ఎమ్మెల్యే సమీక్ష
  • ఖమ్మం : విమర్శలు.. ప్రతి విమర్శలు.. అలక సీన్లు, బుజ్జగింపులు.. నిధులు కేటాయింపుపై పెదవి విరుపు.. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య అంతరం.. అంతలోనే అధికారుల తీరుపై రహస్య సమావేశాలు.. స్పందించిన నాయకులు.. కమిషనర్‌ బదిలీ.. వంటి సంఘటనలతో ముడిపడి ఉన్న ఖమ్మం కార్పొరేషన్‌ పాలక మండలి సమావేశం ఓ కొలిక్కి వచ్చింది. కార్పొరేటర్లకు అనుకూలంగా తీర్మానాలు ఉండేలా ఆగస్టు 10వ తేదీన కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సమాలోచనకు వచ్చినట్లు తెలిసింది. కౌన్సిల్‌ సమావేశం, ఖమ్మం నగర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ తన క్యాంప్‌ కార్యాలయంలో మేయర్‌ పాపాలాల్, టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, విద్యుత్, రెవెన్యూ శాఖలతోపాటు కమిషనర్‌ బోనగిరి శ్రీనివాస్, వివిధ విభాగాలకు చెందిన అధికారులతో సమీక్షించారు. సమావేశపు తేదీ, నిధుల కేటాయింపు తీర్మానాలు మొదలైన విషయాలపై చర్చించారు.
     
    ఆగస్టు 10న కౌన్సిల్‌ సమావేశం
    కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశం తేదీ ఖరారు పలు వివాదాలకు దారి తీసింది. తీర్మానాలపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేయడం.. కమిషనర్‌పై నాయకులకు ఫిర్యాదు చేయడం.. వారు స్పందించి కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డిని పట్టుబట్టి బదిలీ చేయించారనే వార్తలొచ్చాయి. ఇటువంటి పరిస్థితిలో తిరిగి సమావేశం ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడ్డారు. ఏకపక్ష నిర్ణయం ఎందుకనే ఆలోచనతోపాటు స్థానిక ఎమ్మెల్యేతో సమావేశం విషయం ప్రస్తావించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే బుధవారం సమావేశం ఏర్పాటు చేసి.. అందరు కార్పొరేటర్లతో చర్చించి ఆగస్టు 10న కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు, తీర్మానాలపై సలహాలు సూచనలు తీసుకున్నట్లు తెలిసింది.

    కార్పొరేటర్లకు బొనాంజా
    కార్పొరేటర్లందరినీ మెప్పించే విధంగా ఎమ్మెల్యే సూచనలు చేయడంతో అధికారులు, కార్పొరేటర్ల నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలిసింది. గతంలో డివిజన్‌ అభివృద్ధికి రూ.30లక్షలు, మొత్తం రూ.15కోట్లతో చేపట్టే పనులకు తీర్మానాలు తయారు చేశారు. అయితే రూ.30లక్షలు సరిపోవని కార్పొరేటర్లు కోరగా.. వీటిని రూ. 50లక్షలకు పెంచి మొత్తం రూ.25కోట్ల పనులకు తీర్మానాలు చేసేలా అంగీకరించారు. ఆయా డివిజన్లలో అత్యవసర పనులు చేపట్టేందుకు కార్పొరేటర్‌వద్ద డబ్బులు ఉండాలని, ప్రతీ మూడు నెలలకోమారు రూ.లక్ష కేటాయించి వాటిని పారిశుద్ధ్య, తాగునీటి సరఫరా, ఇతర కార్యక్రమాలకు ఉపయోగించేలా అవకాశం కల్పించనున్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిరక్షించే బాధ్యత కార్పొరేటర్లకు అప్పగించడంతోపాటు డివిజన్‌కు 100 చొప్పున టీగార్డులు కొనుగోలు చేసి ఇవ్వాలనే అంశాన్ని పొందుపరిచారు. కార్పొరేటర్లు వ్యతిరేకించిన రూ.4.5కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద చేపట్టిన పనులకు జనరల్‌ ఫండ్‌ నుంచి నిధులు కేటాయించాలనే నిర్ణయాన్ని పక్కన పెట్టినట్లు తెలిసింది.

    రూ.100కోట్లపై చర్చ
    ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన విధంగా ప్రతీ కార్పొరేషన్‌కు రూ.100కోట్ల కేటాయింపు జరిగితే వాటిని ఎలా ఖర్చు చేయాలనే అంశంపై చర్చ జరిగింది. ఈ నిధులతో గోళ్లపాడు చానల్‌ పనులు, నగరంలోని ఇల్లెందు క్రాస్‌రోడ్డు, కొత్తబస్టాండ్‌ సెంటర్‌తోపాటు కూరగాయల మార్కెట్, గాంధీచౌక్‌ సెంటర్‌ సుందరీకరణ, వాటర్‌ ఫౌంటేన్‌ ఏర్పాటుతోపాటు గాంధీచౌక్‌ నుంచి ట్రంక్‌రోడ్డు మీదుగా కాల్వొడ్డు వరకు ఫోర్‌లేన్‌ రోడ్డు నిర్మాణం, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న షాదీఖానా మరమ్మతులు, కొత్త షాదీఖానా, కబేళా నిర్మాణాలు, దంసలాపురం, బల్లేపల్లి ప్రాంతాల్లో కొత్తగా రెండు శ్మశాన వాటికల కోసం స్థలం కేటాయింపునకు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. కార్పొరేషన్‌ పరిధిలో ఉండి..lఆర్‌అండ్‌బీ రోడ్లకు అనుసంధానంగా ఉన్న రోడ్లను ఆర్‌అండ్‌బీకి కేటాయించాలని, వీటికి  ఆధునికీకరణ పనులు చేపట్టేలా మంత్రి తుమ్మలను కోరేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చేసిన సూచనలకు కార్పొరేటర్లు, అధికారులు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement