విజయనగరం భక్తులకు సత్యదేవుని ‘దివ్యదర్శనం ’
అన్నవరం:
హిందూ నిరుపేద భక్తులను ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఉచితంగా తీసుకువెళ్లి ఆయా దేవతామూర్తుల దర్శనం చేయించి స్వగృహాలకు చేర్చే ‘దివ్యదర్శనం’ పథకం రెండు నెలలుగా రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ పథకంలో ఐదో విడతగా విజయనగరం జిల్లాకు చెందిన 200 మంది భక్తులు మంగళవారం సాయంత్రం రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకొని పూజలు చేశారు. నాలుగు బస్సులలో వీరు సాయంత్రం ఐదు గంటలకు సత్యదేవుని ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ పండితులు వారికి సాదరంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనానికి తీసుకువెళ్లారు. స్వామి దర్శనం అనంతరం అనివేటి మండపంలో వేదపండితులు వారికి వేదాశీస్సులు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం వారు విజయవాడ వెళ్లారు.