దర్యాప్తు నిర్వహిస్తున్న డీఎల్‌పీవో
నిధుల దుర్వినియోగంపై డీఎల్‌పీవో దర్యాప్తు
Published Tue, Sep 20 2016 11:24 PM | Last Updated on Wed, Aug 29 2018 7:09 PM
తలతంపర (సంతకవిటి) : తలతంపర పంచాయతీలో అధికార పార్టీకి చెందిన వార్డు సభ్యులు నిధుల దుర్వినియోగం చేయడంపై పాలకొండ డీఎల్‌పీవో పి.సత్యన్నారాయణ మంగళవారం దర్యాప్తు నిర్వహించారు. పంచాయతీలో మొత్తం ఎనిమిది మంది వార్డు సభ్యులు ఉండగా వీరిలో మాజీ సర్పంచ్ రుగడ జగన్నాధం, పోలాకి బృందావతి, యాగాటి పోలమ్మ, చిలకలపల్లి దుర్గమ్మ తదితరులు పంచాయతీ నిధులు దుర్వినియోగమయ్యాయని పాలకొండ పంచాయతీ అధికారి పి.సత్యన్నారాయణకు ఇటీవల ఫిర్యాదు చేశారు. పంచాయతీకి సంబంధించి రూ. 3.25 లక్షలు మేర నిధులను ఇదే పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్‌తో పాటు మరో ముగ్గురు వార్డు సభ్యులు తినేసినట్టు ఆరోపిస్తూ ఫిర్యాదు చేసినట్లు జగన్నాధం సాక్షికి తెలిపారు. ఈ మేరకు పాలకొండ డీఎల్‌పీఓ సత్యన్నారాయణ గ్రామానికి చేరుకుని పంచాయతీ కార్యాలయం వద్ద దర్యాప్తు నిర్వహించారు. నిధుల వినియోగంపై ఆరా తీశారు.
రికార్డులు లేవు...
ఇదిలా ఉండగా పంచాయతీ నిధుల దుర్వినియోగానికి సంబం«ధించి ఆరా తీసేందుకు అక్కడ రికార్డులు లేవు. దీంతో డివిజనల్ పంచాయతీ అధికారి పంచాయతీ ఉప సర్పంచ్ కొరికాన వసంత వద్ద వివరాలు సేకరించారు. పంచాయతీ కార్యదర్శి అప్పలసూరిని మందలించారు. వారం రోజుల్లోగా పంచాయతీ రికార్డులు అందించాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని పంచాయతీ సిబ్బందిని హెచ్చరించారు. నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని ఈవోపీఆర్‌డీ జి. వేణుగోపాలనాయుడుకు సూచించారు. ముందుగా సీసీ రోడ్లు నిమిత్తం తీసేసిన నిధులును సక్రమంగా సకాలంలో వినియోగించాలని పాలక మండలి సభ్యులకు సూచించారు. ఈ నిధులు సక్రమంగా వినియోగించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మొత్తం వివరాలు నమోదు చేసుకుని వాటిని జిల్లా అధికారులకు నివేదించనున్నట్టు తెలిపారు.
ఉన్నతాధికారుల హస్తం ఉంది...
పంచాయతీలో నిధుల దుర్వినియోగం చేస్తున్నారని పంచాయతీ మాజీ సర్పంచ్ రుగడ జగన్నాధం సాక్షికి తెలిపారు. గతంలో కూడా పలు ఆరోపణలు పంచాయతీలో పాలక మండలిపై ఉన్నాయని చెప్పారు. తాము నలుగురు వార్డు సభ్యులం ఉన్నా తమకు తెలియకుండా తీర్మానాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రోడ్లు నిర్మిస్తామని చెప్పి ముందుగానే నిధులు తీసేశారని, పంచాయతీ కార్యదర్శి కక్కుర్తి పడుతూ నిధులు కాజేసేందుకు సహకరిస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం జరగకుంటే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
Advertisement