
ఏం చెప్పారు.. సీపీగారూ...
►ట్రాఫిక్ వ్యవస్థ పనిచేయకపోవడం కుట్ర పూరితమా..?
►మరి మూడు రోజులు మీరంతా ఏం చేస్తున్నట్టు
►సిగ్నల్స్ పనిచేయకపోతే.. పోలీసులైనా ఉండాలి కదా
►మరి వారంతా కట్టకట్టుకుని ఎక్కడికి వెళ్లినట్టు
►ఇలాగైతే మహానాడు భద్రత ఎలా?
►సీపీ వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న విమర్శలు
నగరంలో మూడు రోజులుగా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం కుట్ర పూరితమట!.. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం, ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ కాంట్రాక్టు సంస్థ స్టాన్ పవర్ అలక్ష్యం వల్లే మహానగరంలో ట్రాఫిక్ వ్యవస్థ కుప్పకూలిందట!! వెంటనే సదరు సంస్థపై కేసు కూడా పెట్టేశారట!!! మూడు రోజులుగా నగర ప్రజలకు నరకం చూపిస్తున్న ట్రాఫిక్ వ్యవస్థ వైఫల్యంపై నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ చెప్పుకొచ్చిన సంజాయిషీ ఇది. ఈ వివరణలు సంతృప్తిçకరంగాలేకపోగా.. కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.. మరిన్ని విమర్శలకు తావిస్తున్నాయి. యోగానంద్ మీడియా ముందుకొచ్చి ఇదంతా కుట్రపూరితమని చెప్పుకొచ్చారు. సీపీ చెప్పినట్టుగానే జీవీఎంసీ, సిగ్నల్ కాంట్రాక్టు సంస్థ వైఫల్యమే అనుకుందాం.. మరి మూడురోజుల పాటు పోలీసు అధికారులు ఎందుకు స్పందించలేదు?.. సోమవారం నుంచి బుధవారం వరకు విశాఖ మహానగరంలో ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా పనిచేయలేదంటే పోలీసు వ్యవస్థ ఏమేరకు పని చేస్తున్నట్టు??.. ఒకవేళ నిజంగానే సదరు సంస్థల నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే సిగ్నల్స్ పనిచేయలేదనే అనుకుందాం.. మరి ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నట్టు.. వెంటనే పసిగట్టి సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేయాలి కదా..
ట్రాఫిక్ సిబ్బంది ఎక్కడ?
రోజుల తరబడి సిగ్నల్స్ పనిచేయని పరిస్థితిలో కనీసం పోలీసులు అక్కడే విధులు నిర్వర్తించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలి కదా.. కానీ ఈ మూడురోజుల్లో నగరంలోని సిగ్నల్స్ వద్ద ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా కనిపించలేదు. వందల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఉన్నట్టుండి ఏమైపోయారు.. ఖాకీలంతా కట్టకట్టుకుని ఒక్కసారిగా ఎక్కడికి వెళ్లినట్టు... ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం నగర ప్రజలందరికీ తెలుసు. మహానాడు పనుల్లో ఖాకీలు మునిగితేలడం వల్లే ఈ ట్రాఫిక్ వైఫల్యం అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఏమో సీపీ చెప్పినట్టు జీవీఎంసీ, స్టాన్‌పవర్‌ల నిర్లక్ష్యం వల్ల సాంకేతిక ఇబ్బందులు కూడా తలెత్తి ఉండవచ్చు.. కానీ ట్రాఫిక్ జంక్షన్లలో ఒక్క పోలీసు కూడా విధులు నిర్వర్తించని తప్పిదానికి ఎవరిని బాధ్యులను చేయాలన్నది పోలీసు అధికారులకే వదిలేయాలి.
ఇలాగైతే మహానాడు భద్రత ఏమేరకు
మూడురోజుల పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడానికి కారణం కనుక్కునేందుకు విశాఖ పోలీసులకు మూడురోజుల సమయం పట్టింది. ఇంతటి ఘనత వహించిన పోలీసులు మహానాడుకు ఏ మేరకు భద్రత కల్పిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. తెలుగుదేశం పార్టీ అట్టహాసంగా నిర్వహిస్తున్న మహానాడుకు సీఎంతో సహా మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల చైర్మన్లు, ప్రజాప్రతినిధులతో పాటు పాతిక వేలమందికి పైగా టీడీపీ కార్యకర్తలు తరలిరానున్నారు. వీరి భద్రతా సిబ్బందితో పాటు మందీమార్బలమంతా మూడు, నాలుగురోజులు ఇక్కడే మకాం వేయనున్నారు. ఇక అధికార యంత్రాంగం తరలిరానుంది. ఓ విధంగా రాష్ట్రంలో పాలన మూడురోజుల పాటు ఇక్కడి నుంచే కొనసాగనుంది. ఈ పరిస్థితుల్లో పోలీసులు ఏ మేరకు భద్రత కల్పిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. మహానాడు నేపథ్యంలో ఎటూ నగర పౌరుల భద్రతను గాలికొదిలేసిన ఖాకీలు కనీసం మహానాడుకైనా సరైన భద్రత కల్పిస్తే అదే మహా యోగం.. అనే పరిస్థితి ఇక్కడ నెలకొంది.