డాక్టర్‌ను సస్పెండ్ చేయాలంటూ ఆందోళన
హిందూపురం టౌన్ : ఆశావర్కర్‌ను దూషించిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ సీపీఎం, సీఐటీయూ, ఆశా వర్కర్లు మంగళవారం ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్, సీపీఎం డివిజన్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న గైనకాలజిస్టు వైద్యురాలు మాధవి పరిగికి చెందిన ఆశా వర్కర్ పద్మను‘చెప్పుతో కొడతా’ అంటూ దుర్భాషలాడడం ఎంతవరకు సమంజసం అన్నారు.
చాలీచాలని జీతాలతో జీవిస్తున్న ఆశావర్కర్లను దూషించిన డాక్టర్‌పై క్రమశిక్షణ రహిత చర్యలు తీసుకుని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎంఓ రుక్మిణమ్మ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని చెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సీపీఎం, సీఐటీయూ నాయకులు నారాయణస్వామి, రాజప్ప, రాము, లింగారెడ్డి, మారుతీ, ఆశావర్కర్లు భాగ్యలక్ష్మి, జయమ్మ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.