వైద్యం కోసం వస్తే చూపు పోయింది..
-
రిమ్స్ వైద్యుల నిర్లక్ష్యం : తల్లిదండ్రులు
-
విచారణకు ఆదేశించిన ఇన్‌చార్జి డైరెక్టర్
ఆదిలాబాద్ రిమ్స్ : వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రికి వస్తే కంటి చూపు కోల్పోవాల్సి వచ్చింది. ఇందుకు రిమ్స్ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం.. జైనూర్ మండలం పాట్నాపూర్ గ్రామానికి చెందిన పెర్కం నర్సయ్య, కమల దంపతుల కూతురు రోజా(12)కు వాంతులు, విరేచనాలు కావడంతో ఈ నెల 8న ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి రక్తహీనత ఉందంటూ ఈ నెల 12న ఒక యూనిట్ ‘బీ పాజిటివ్’ రక్తం ఎక్కించారు. ఆరోగ్యం కుదుట పడడంతో మరుసటి రోజు 13న డిశ్చార్జ్ చేసి పంపించారు.
ఇంటికి వెళ్లినప్పటి నుంచి కుడి కన్ను వాపు రావడం చూపు మందగించింది. కన్ను కనిపించకపోవడంతో శనివారం సాయంత్రం రిమ్స్‌కు తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి కంటి చూపు పూర్తిగా పోయిందని, ఆపరేషన్ చేయాలని చెప్పారు. దీంతో కంగుతిన్న తల్లిదండ్రులు.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చూపు కోల్పోయిందని, రక్తం ఎక్కించడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని ఆరోపించారు. ఈ విషయమై రిమ్స్ ఇన్‌చార్జి డైరెక్టర్ అనంతరావు విచారణకు ఆదేశించారు. చూపు కోల్పోవడానికి కారణాలు తెలుసుకుంటామని, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఇలా జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.