డాక్టర్లొస్తున్నారోచ్..!
-
ఎనిమిదేళ్లకు మోక్షం
-
పూర్తిస్థాయిలో వైద్యుల నియామకం
-
మెరుగుపడనున్న వైద్య సేవలు
-
మెడికోల చదువులకు తప్పనున్న ఇబ్బందులు
-
ఒకే రోజు విధుల్లో చేరిన 53 మంది వైద్యులు
-
త్వరలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో పూర్తిస్థాయిలో వైద్యుల నియామకానికి ఎనిమిదేళ్లకు మోక్షం కలిగింది. రిమ్స్ ప్రారంభం నుంచి వైద్యుల కొరతతో రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో వైద్యుల భర్తీ కోసం జరిగిన ఇంటర్వ్యూలో రిమ్స్ ఆస్పత్రికి 53 మంది వైద్యులను ఎంపిక చేశారు. ఇందులో 18 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 35 మంది ట్యూటర్లు ఉన్నారు. వీరందరికీ సోమవారం రిమ్స్ డైరెక్టర్ అశోక్ నియామక పత్రాలు అందజేశారు. దీంతో ట్యూటర్లు పూర్తిస్థాయిలో భర్తీకాగా, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీగా ఉంది. వీటితోపాటు 22 అసోసియేట్, 19 మంది ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
రిమ్స్‌కు కేటాయించిన 151 పోస్టుల్లో కేవలం 53 మంది వైద్యులే పనిచేస్తున్నారు. దీంతో పూర్తిస్థాయిలో ఇటు వైద్యం అందించేందుకు, అటు బోధన సిబ్బంది లేకపోవడంతో రోగులు, మెడికోలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జిల్లా కేంద్రంలో రిమ్స్‌ను ఏర్పాటు చేశారు. 500 పడకల సామర్థ్యం, అత్యాధునిక వైద్య పరికరాలతో రోగులకు కార్పొరేట్ వైద్యం అందించే స్థాయిలో రిమ్స్‌లో ఏర్పాటు చేయడానికి వైఎస్ కృషి చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండేళ్లకు రిమ్స్‌లో పూర్తిస్థాయిలో వైద్యుల నియామకం చేపట్టారు. ప్రస్తుతం రిమ్స్‌కు మంజూరు చేసిన 151 పోస్టులో 19 మంది ప్రొఫెసర్లు, 22 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా త్వరలో భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది.
మెరుగుపడనున్న వైద్య సేవలు..
రిమ్స్ ఆస్పత్రికి వచ్చే రోగులకు మొత్తం 21 విభాగాలు ఉన్నాయి. 10 వార్డుల్లో రోగులకు వైద్యం అందిస్తున్నారు. గతంలో వైద్యులు లేకపోవడంతో రోగులకు వైద్య సేవలు అందలేదు. వైద్యుల భర్తీ కోసం భర్తీ కోసం ఎన్నిసార్లు రిమ్స్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించినా వైద్యుల నియామకం జరగలేదు. దీనికి కారణం జిల్లా హైదరాబాద్‌కు దూరంగా ఉండడం, ఇక్కడ వసతులు సరిగా ఉండవనే భావనే. వెనుకబడిన జిల్లాకు అదీ.. వందల కిలోమీటర్ల దాటి రిమ్స్‌కు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. మొదట్లో మహారాష్ట్రకు చెందిన వైద్యులు ఎక్కువ కాలం రిమ్స్‌లో చికిత్స అందించారు. దాదాపు 50 శాతంపైనే మహారాష్ట్ర వైద్యులతో రిమ్స్ కొనసాగింది.
రానురాను అక్కడి వైద్యులు వెళ్లిపోవడం, కొంత మంది కాలపరిమితి ముగియడంతో చివరకు భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు వైద్యుల నియామకాలు జరుగుతుండడంతో రిమ్స్‌కు మంచిరోజులు వచ్చాయి. కీలకమైన పోస్టులు భర్తీకానున్నాయి. వీరితోపాటు రిమ్స్‌లో ఐదేళ్లు చదువు పూర్తిచేసిన హౌస్‌సర్జన్‌ల సేవలూ అందనున్నాయి. త్వరలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మెడికోలకు తప్పనున్న ఇబ్బందులు..
రిమ్స్‌లో వైద్య పోస్టుల భర్తీ కానుండడంతో మెడికోలకు కూడా ఇబ్బందులు దూరం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న వైద్యులు రోగులకు వైద్యం అందిస్తూనే, విద్యార్థులకు బోధన చేస్తున్నారు. ఒకే సమయంలో రెండు సేవలు అందించడం కష్టమవుతోంది. ఆయా సబ్జెక్టుకు సంబంధించి ప్రాక్టికల్‌గా చేసి చూపించాలన్నా భారంగానే ఉంది. 20 నుంచి 30 మంది విద్యార్థులకు ఒకేసారి సదరు వైద్యుడు బోధన, రోగులకు చికిత్స అందిస్తున్నారు. బోధన సిబ్బంది కొరత కారణంగా ఒక్కరోజులో పూర్తికావాల్సిన పాఠాలు రెండుమూడు రోజులు చేయాల్సి వస్తోంది. దీంతో చదువులు వెనుకబడిపోతున్నాయి.
విద్యార్థులకు ఇటు థియరీ తరగతులు, ప్రాక్టికల్స్ చేయిస్తూనే మరోవైపు రోగులకు వైద్య చికిత్స చేస్తున్నారు. దీంతో వైద్యులపై కూడా పనిభారం పెరిగిపోతోంది. ఒకవేళ ఉదయం 9 గంటలకు ఔట్‌పేషెంట్స్ రోగులు ఎక్కువగా ఉంటే ఆ సమయంలో వైద్యులు వారికి వైద్య పరీక్షలు చేసి, మళ్లీ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరీక్షించేందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా ఒక్కడే ఇటు ఔట్‌పేషెంట్స్‌ను, అటూ ఇన్‌పేషెంట్స్‌ను చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రెండు బ్యాచ్‌లు విజయవంతంగా పూర్తి చేసుకున్న రిమ్స్‌లో పూర్థిస్థాయిలో వైద్యులు భర్తీ కానుండడంతో ఇబ్బందులు తప్పనున్నాయి.