
దాడిలో గాయపడి మృతి చెందిన జిమ్మీ
అమీర్‌పేట: అక్రమ వ్యాపారానికి కుక్క ఆటంకం కలిగిస్తుందని భావించిన కొందరు వ్యక్తులు కుక్కపై రాళ్లతో దాడి చేశారు. చికిత్స పొందుతూ శనివారం ఆ కుక్క మృతి చెందింది. ఈ సంఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం...బోరబండ రాజ్‌నగర్‌కు చెందిన దయానంద్‌కు కుక్కలంటే ప్రేమ. తన ఇంట్లో 7 సంవత్సరాల వయసుగల ల్యాబ్‌రా జాతికి చెందిన జిమ్మీ అనే కుక్కను పెంచుకుంటున్నాడు.
ఇంటికి కాపలాగా కూడా ఉంటున్న జిమ్మీ రాత్రి వేళ ఎంతో అప్రమత్తంగా ఉండేది. కాగా స్థానికంగా కొందరు వ్యక్తులు అక్రమంగా నిషేధిత మత్తు పదార్థాలు (గాంజాయి) విక్రయిస్తున్నారు. వాటిని కొనుగోలు చేసేందుకు అర్థరాత్రి సమయంలో పలువురు రాజ్‌నగర్‌కు వచ్చి తిష్టవేస్తుండగా...వారిని చూసి జిమ్మీ మొరిగేది. దీంతో తమ వ్యాపారానికి కుక్క ఆటంకం కలిగిస్తుంది భావించిన కొందరు వ్యక్తులు...యజమాని ఇంట్లో లేని సమయంలో దానిపై రాళ్లతో దాడిచేశారు. కళ్లు, తలపై తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకుంది.
దీన్ని గమనించిన యజమాని దయానంద్ చికిత్స నిమిత్తం నారాయణగూడలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జిమ్మీ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. యజమాని దయానంద్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు మృతదేహన్ని గాంధీ మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన అక్కడి వైద్యులు జిమ్మీ అవయవాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.