శునక సీమంతం చూద్దాం రారండి
‘కదిలే కాలమా.. కాసేపు ఆగవమ్మా.. జరిగే వేడుక కళ్లారా చూడవమ్మా.. పేగే కదలగా.. సీమంతమాడెనే ప్రేమదేవతకు నేడే’ అంటూ పెదరాయుడు పాడుతుంటే చూసిన ఆడవాళ్లంతా ఆ వేడుకలోని ఆనందాన్ని అనుబంధాన్ని ఆస్వాదించేవాళ్లు. ఇప్పుడు కొన్ని ఇళ్లలో జరుగుతున్న వెరైటీ సీమంతాలు చూసిన వాళ్లు... చిత్రమైన అనుభూతికి లోనవుతున్నారు. ఎందుకంటే అక్కడ జరిగేవి పెంపుడు జంతువుల సీమంతాలు మరి.
కనకపు లోగిలిలో శునకంగా పుట్టిననేమి... నగరంలో కొన్ని ఇళ్లలో శునక సౌభాగ్యం చూసిన వాళ్లకు ఇలా అనిపించకమానదు. కన్నవారు, కడుపున పుట్టిన వారితో సమానంగా పెంపుడు శునకాన్ని సైతం ప్రేమిస్తూ వాటి కోసం లక్షలు ఖర్చు పెట్టడం, అవి మరణిస్తే కర్మకాండలు చేయించి స్మారక చిహ్నాలు సైతం నిర్మిస్తూ.. తమలోని పెట్ ప్రేమను చూపుతున్న వారెందరో సిటీలో. అలాంటి వారి ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చిందే పప్పీ షవర్. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే.. శునకానికి సీమంతం.
పప్పీకి ప్రేమతో...
అచ్చంగా మహిళలకు సీమంతం చేసినట్టుగానే పెంపుడు శునకాలకూ చేస్తున్నారు. దీనిని పప్పీ షవర్ అంటున్నారు. ప్రెగ్నెంట్ పెట్ కోసం విదేశాల్లో మనతో పోలిస్తే కాసింత భిన్నమైన తరహాలో ఫాలో అయ్యే పప్పీ షవర్ ట్రెండ్ ఇప్పుడు నగరానికి కూడా పరిచయమైంది. ఇప్పటికే పెట్స్ ప్రేమలో మునిగి తేలుతున్న సిటీ.. పప్పీ షవర్‌ను సైతం ఆత్రంగా అందుకుంది. మొన్నటి వరకు కుక్కలకు బర్త్ డే, గెట్ టు గెదర్ పార్టీలను వింతగా చూసిన మనం.. ఏంటీ శునకాలకు సీమంతం చేస్తున్నారా? అని ఆశ్చర్యంగా అంటున్నా.. త్వరలోనే ఇది కూడా చాలా మామూలు విషయంగానే మారిపోక తప్పదు.
ప్రత్యేక జాగ్రత్తలు...
ప్రెగ్నెంట్ పెట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతిరోజు ప్రత్యేకమైన సబ్బులు, ఆయిల్స్‌తో స్నానం చేయించి బలమైన ఫుడ్ పెడుతున్నారు. మెడిసిన్స్ ఇస్తూ స్పెషల్ రూమ్ సైతం దీనికి కేటాయిస్తున్నారు. నెలవారీగా మెడికల్ చెకప్‌లకు తీసుకెళ్తున్నారు. ప్రసవం సజావుగా జరగడానికి అన్ని రకాల సౌకర్యాలూ కల్పిస్తున్నారు. మానసిక సంతోషానికి, ఉల్లాసాన్ని పెంచేందుకు మార్నింగ్, ఈవెనింగ్ పార్క్‌లో వాకింగ్‌లకు తీసుకెళ్తున్నారు.
ఆహ్వాన పత్రికలు కూడా..
సాధారణంగా ఐదు నెలలు పూర్తయ్యాక పప్పీ షవర్ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక హంగులతో రెడీ చేసిన ఇన్విటేషన్ కార్డులను సైతం పంచుతున్నారు. వీటిని పెట్ ప్రేమికులైన బంధువులు, స్నేహితులకు పంపిస్తున్నారు. అయితే శునకాలను పెంచుకునే సరదా ఉన్న వారిని మాత్రమే ఈ పార్టీకి రావల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.
గెస్ట్ కుక్కలకు పెట్ పోటీలు..
ఈ సెలబ్రేషన్ కోసం ప్రత్యేకంగా బాంక్వెట్ హాల్స్ కూడా బుక్ చేస్తున్నారు. దీంతో పాటు స్పెషల్ బఫే చేయిస్తున్నారు. కుక్కకు సీమంతం చేసేందుకు ప్రత్యేక థీమ్ డెకరేషన్ చేయించడంతో పాటు వచ్చిన గెస్ట్‌లతో పాటు కుక్కలకు రిటర్న్ గిఫ్ట్స్ అందిస్తున్నారు. అలాగే అతిథులను ఎంటర్‌టైన్ చేయడానికి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. పెట్ గెస్ట్‌్సకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్లేస్‌లో గేమ్స్ ఆడిస్తున్నారు. వీటికోసం స్పెషల్ ఫొటోబూత్‌ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.
– శిరీష చల్లపల్లి