అభాగ్యులకు ‘అమ్మ’ | donaters are great | Sakshi
Sakshi News home page

అభాగ్యులకు ‘అమ్మ’

Published Thu, Aug 31 2017 1:42 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

అభాగ్యులకు ‘అమ్మ’ - Sakshi

అభాగ్యులకు ‘అమ్మ’

మౌనం అంటే ప్రార్థన
ప్రార్థనంటే ఓ నమ్మకం
నమ్మకమంటే ప్రేమ
ప్రేమంటే ఓ సేవ
సేవలోనే సంతృప్తి


అనంతపురం మెడికల్‌: విశ్వమాత మదర్‌థెరీసా నమ్మిన సిద్ధాంతమిది..  ఆమె అడుగుజాడల్లో పయనిస్తున్నాడో యువకుడు. అనాథలకు ‘అమ్మ’లా.. అన్నార్థులకు ‘అన్న’లా.. కన్నవారి సంరక్షణకు నోచుకోని వృద్ధులకు ‘కొడుకు’లా ఉంటూ సేవాపథంలో పయనిస్తున్నారు. అందరూ గొప్ప పనులు చేయలేదు.. కానీ చిన్న పనులైనా ‘ప్రేమ’తో చేయవచ్చని నిరూపిస్తున్నాడు.

డిగ్రీ చదివి రోజుల్లోనే..!
శింగనమల మండలం తరిమెలకు చెందిన రమణారెడ్డి 1997లో డిగ్రీ చదివే రోజుల్లోనే స్నేహితుల సహకారంతో ‘అమ్మ’ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. అప్పట్లో మెదడు వాపు వ్యాధితో అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు నిరంతరాయంగా పౌష్టికాహారం అందజేశారు. ఇదే సమయంలో రక్తం అందక ఎంతో మంది మృత్యువాత పడుతున్న ఘటనలు ఆయన మనసును కలచివేశాయి. ‘రక్తదానం..మహాదానం’ నినాదంతో పెద్ద ఎత్తున రక్తదాన ఉద్యమాన్ని చేపట్టారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతో మందికి తోడుగా నిలిచారు. అలాగే నా అన్న వారు లేక ‘అనాథ’లుగా బతుకీడుస్తున్న వారికి చేయూతనందించారు.  మృత్యువాత పడితే అంత్యక్రియల సేవ ప్రారంభించారు. సహాయం చేయడానికి ఉండాల్సింది డబ్బు కాదని.. మంచి మనసని నిరూపించారు. తాను సంపాదిస్తున్న మొత్తంలో నెలవారీగా కొంత పక్కకు తీసి దాతలు, స్నేహితుల సహకారంతో ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు.

సమాజంలో మానసిక వికలాంగులు పడుతున్న కష్టాలను కళ్లారా చూసి చలించిపోయారు. ఇప్పటికీ నగరంలోని కొన్ని పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని కొనసాగిస్తున్నారు. అనాథ ఆశ్రమ విద్యార్థులకు కావాల్సిన వైద్య సదుపాయాలు అందజేస్తున్నారు. అనంతలోని ‘ఆదరణ మానసిక వికలాంగుల ఆశ్రమం’లో అమ్మ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, వేసవిలో రక్షిత మంచి నీటి సదుపాయం ఏర్పాటు చేశారు. 12 ఏళ్లుగా  వందలాది మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేస్తున్నారు.

కొన్ని స్కూళ్లకు గ్యాస్‌ స్టవ్, ప్లేట్లు, బియ్యం పంపిణీ చేశారు. జీవిత చరమాంకంలో ఆప్యాయత కరువై.. పిల్లల సంరక్షణకు నోచుకోని వృద్ధులకు తోడుగా ఉంటున్నారు. నగరంలోని వృద్ధాశ్రమాలకు నిత్యావసర సరుకులు ఇవ్వడంతో పాటు మెడికల్‌ క్యాంపులను నిర్వహిస్తున్నారు. దురదృష్టవశాత్తు మృతి చెందితే వారి దహన సంస్కారాలకు ఆర్థికసాయం అందిస్తున్నారు. ఏటా మదర్‌ థెరీసా జయంతి పురస్కరించుకుని పేద విద్యార్థులకు, వృద్ధులకు, మానసిక వికలాంగులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల వారోత్సవాలు చేపడుతూ వారిలో మనోస్థైర్యాన్ని నింపుతున్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కెరీర్‌ ఫౌండేషన్‌ కోర్సుల్లో శిక్షణ ఇప్పించి వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో తమ వంతు కృషి చేస్తున్నారు.  

అధికారులు, ప్రముఖుల భాగస్వామ్యం
‘అమ్మ’ సంస్థ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో అధికారులు, ప్రముఖులను భాగస్వాముల్ని చేస్తున్నారు. ఈ క్రమంలో వారు సైతం పేదలకు చేయూత నిస్తున్నారు. డీఎస్పీ శ్రీనివాసులు అదే కోవలోకి వస్తారు. ఆదరణ మానసిక వికలాంగుల పాఠశాలకు తనవంతుగా ఈయన సాయం అందించారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఐఎంఏ హాల్‌లో అనాథ వృద్ధులకు దుస్తులు పంపిణీ చేయగా ముఖ్య అతిథిగా ఆర్డీటీ డైరెక్టర్‌ మాంఛోఫెర్రర్‌ హాజరై ‘అమ్మ’ చేయూతను కొనియాడారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి సాయం అందకపోయినా స్వచ్ఛంద సంస్థలు వృద్ధుల సంక్షేమానికి పాటు పడుతున్నాయంటూ భుజం తట్టారు. జేఎన్‌టీయూ మాజీ రిజిస్ట్రార్‌ హేమచంద్రారెడ్డి, జిల్లా న్యాయసేవా ప్రాధికార సంస్థ కన్వీనర్‌ కమలాకర్‌రెడ్డి, ప్రముఖ న్యాయవాది శైలజ, ఇక్కడ ఎస్పీగా పని చేసిన రాజశేఖర్‌బాబు.. ఇలా ఎంతో మంది ప్రముఖులు ‘అమ్మ’కు తోడుగా నిలుస్తున్నారు.

‘సాక్షి’ కథనానికి స్పందనగా
అనంతపురం రూరల్‌ మండలం పూలకుంట గ్రామానికి చెందిన గోపీనాథ్‌ గౌహతిలో బీటెక్‌ చదువుతుండేవాడు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడ్డాడు. రూ.లక్షలు ఖర్చు చేసినా నయం కాలేదు. ఇదే సమయంలో ‘తల్లిడిల్లితున్న తపన’ శీర్షికతో సాక్షి కథనం ప్రచురించింది. స్పందించిన రమణారెడ్డి బాధిత కుటుంబ సభ్యులను కలిశారు. యువకుడు ఆహారం తీసుకునేందుకు సైతం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో న్యూట్రీషియన్‌ పౌడర్, ఆర్థికసాయం చేసి మానవీయతను చాటుకున్నారు. భవిష్యత్‌లో కూడా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఇద్దరు మానసిక వికలాంగుల దత్తత
అనంతపురంలోని అనంత సాగర్‌ కాలనీకి చెందిన జయమ్మ భర్తను కోల్పోయింది. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో రాజ్యలక్ష్మి, రాజశేఖర్‌ మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. ‘ఆదరణ’ మానసిక వికలాంగులు, చెవిటి పిల్లల పాఠశాలలో చదువుతున్నారు. కుటుంబం గడవడమే కష్టంగా ఉన్న తరుణంలో రమణారెడ్డి స్పందించి ఇద్దరినీ దత్తత తీసుకున్నారు.

సేవలోనే సంతృప్తి
ఎదుటికి మనిషికి సాయం చేయడంలో ఎంతో ఆనందం ఉంది. అదే నాకు సంతృప్తి. 20 ఏళ్లుగా నిర్విఘ్నంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నా. స్నేహితులు, కొందరు అధికారులు భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు. చివరి శ్వాస వరకు సేవా కార్యక్రమాలు చేపడతా.
రమణారెడ్డి, అమ్మ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement