కంప్యూటర్ సెంటర్‌ను ప్రారంభిస్తున్న పీవో వెంకటరావు
సీతంపేట: ట్రైబుల్ సబ్‌ప్లాన్‌లో రూ.12 కోట్లతో గిరిజనులకు రుణాలు మంజూరు చేయనున్నట్టు ఐటీడీఏ పీవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. బుధవారం సీతంపేటలో ట్రైకార్ ద్వారా మంజూరైన కంప్యూటర్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకర్ల ద్వారా రుణాలు ఇప్పిస్తామని కొంతమంది దళారులు తిరుగుతున్నారని వారిని ఆశ్రయించవద్దన్నారు. పంచాయతీకి 40 చొప్పున అర్హులైన వారికి రుణాలు మంజూరు చేయనున్నామన్నారు. గ్రామాల్లో నిరుద్యోగ యువత ఖాళీగా ఉండకుండా వారి కాళ్లపై వారు నిలబడేలా రుణాలు ఇప్పించడం జరుగుతుందన్నారు.
ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఇతర కోర్సులు చేసిన వారిని గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు చైతన్యం చేయాలన్నారు. మేకలు, గొర్రెలు వంటి యూనిట్లు కూడా పెట్టుకోవడానికి ముందుకు రావాలని సూచించారు. రూ.50 వేల వరకు ఒక్కొక్కరికి రుణాలు ఇప్పిస్తామని, వ్యాపారాలు పెట్టుకోవచ్చని తెలిపారు. తీసుకున్న రుణాలు సైతం తిరిగి సకాలంలో బ్యాంకులకు చెల్లించాలని చెప్పారు. ట్రైకార్, మహిళా సంఘాల పేరుతో కూడా రుణాలు ఇవ్వనున్నామన్నారు. కొంతమంది యువతీ, యువకులకు పోలీస్‌కానిస్టేబుల్ శిక్షణకు కూడా పంపిస్తామని చెప్పారు. అలాగే, గ్రూప్స్‌కు కూడా కోచింగ్ ఇవ్వనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జెడ్‌పీటీసీ సభ్యుడు రాజబాబు, జెడ్‌పీ కోఆప్షన్ సభ్యుడు సవరతోట ముఖలింగం, ఎంపీటీసీ బి.దమయంతి, మాజీ ఎంపీపీ ఎస్.మాలయ్య, బి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.