బంగారం రుణాలు ఇవ్వొద్దు..!
–బ్యాంకర్లకు సూచించిన సీఎం చంద్రబాబు
–వడ్డీ రాయితీని ఎగ్గొట్టేందుకు ప్రయత్నం
–గగ్గోలు పెడుతున్న రైతులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో షాక్ ఇచ్చారు. ఇక నుంచి రైతులకు బంగారంపై రుణాలు ఇవ్వొద్దని నేరుగా బ్యాంకర్లకు సూచించారు. విజయవాడలో సోమవారం జరిగిన 195వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భూమి వివరాలు ఆధారంగా ప్రాథమిక రుణాలే అందజేయాలని, బంగారం తాకట్టు రుణాలు అందజేయొద్దని ఆదేశించారు. ఇప్పటికే అడంగల్ సరిగా లేకపోవడం, రుణాల మంజూరుకు బ్యాంకర్లు సహకరించకపోవడంతో రైతులు సతమతమవుతున్నారు. సులభంగా లభ్యమయ్యే బంగారు ఆభరణాల తాకట్టు రుణాలు కూడా ఇవ్వొద్దని సీఎం చెప్పడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వడ్డీ రాయితీని ఎగ్గొట్టేందుకు సీఎం కుట్రపన్నారంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే రుణమాఫీ అంటూ మోసం చేశారు. ఇప్పుడు మరోసారి కష్టాల పాలచేసేందుకు పూనుకుంటున్నారని, రైతు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని వాపోతున్నారు.
నెరవేరని రుణ లక్ష్యం..
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 5.4 లక్షల మంది రైతులకు రూ.1,375 కోట్ల రుణాలు మంజూరు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. ఖరీఫ్ గడువు ముగిసే సమయానికి 2.9 లక్షల మంది రైతులకు రూ.700 కోట్ల రుణాలు అందజేశారు. ఈ ఏడాది రైతులు కేవలం 51 శాతం మాత్రమే లక్ష్యాలు చేరగలిగారు. అంటే ఈ ఏడాది ఖరీఫ్‌లో వివిధ కారణాలు, ప్రభుత్వ వైఫల్యాలు, నిబంధనల వల్ల సగం మంది రైతులు రుణాలు పోందలేక పోయారన్నది వాస్తవం.
రైతులకు బంగారు రుణాలు ఎండమావే..
రైతులు వ్యవసాయ మదుపులు కోసం బంగారాన్ని తాకట్టుపెట్టి రుణం తీసుకోవడం సహజం. ఈ ఏడాది జిల్లాలో సుమారు 60 వేల మంది రైతులు బంగారాన్ని తాకట్టుపెట్టి సుమారు వందకోట్ల రుణాన్ని పొందినట్టు సమాచారం. ఏడాది లోపల ఈ రుణాన్ని బ్యాంకర్లకు చెల్లిస్తే వడ్డీ రాయితీని ప్రభుత్వం భరిస్తుంది. ఇది దశాబ్దాలుగా వస్తున్న విధానం. ప్రస్తుత సీఎం దీనికి కోత పెట్టారు. వడ్డీ రాయితీ భారాన్ని తప్పించుకునేందుకు రైతులకు బంగారు రుణాలు మంజూరు చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.