ఇళ్లమధ్య నిలిచిన మురుగు
నివాసాల మధ్య మురుగు నీటి కుంటలు
కొరవడిన పారిశుద్ధ్య నిర్వహణ
రోగాల బారినపడుతున్న చిన్నారులు
సమస్యను పరిష్కరించాలంటున్న స్థానికులు
గజ్వేల్ రూరల్: ఇళ్ల పరిసరాలలో మురుగు నీరు నిలుస్తుందని... వాటిలో పందులు స్వైర విహారం, దోమల బెడదతో రోగాల బారిన పడుతున్నామని వాసవీనగర్ కాలనీవాసులు వాపోతున్నారు. నగర పంచాయతీ పరిధిలోని 2వ వార్డు వాసవీనగర్ కాలనీలోని పలు నివాస ప్రాంతాల మధ్య మురుగునీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు కాలనీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే పల్లపు ప్రాంతంలోని నీరు పారదల లేక నిలిచిపోవడంతో కుంటగా తయారైంది. రోజుల తరబడి నీరు నిలిచిపోవడంతో పాచిపట్టి దుర్గంధం వెదజల్లుతోందని, దీనికితోడు పందులు సంచరిస్తుండటంతో దోమల బెడదల ఎక్కువైందని చెబుతున్నారు.
కాగా వాసవీనగర్‌లోని పలుప్రాంతాల్లో నివాస గృహాల మధ్య పశువుల వ్యర్థ పదార్ధాలను నిల్వచేస్తుడటంతో పందుల సంచారం ఎక్కువైందని వివరించారు. మురికినీరు నిల్వ ఉండటంతో తమ మలేరియా, డెంగ్యూ లాంటి రోగాలు ప్రబలు తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
నగర పంచాయతి పరిధిలో నిరంతరం పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాల్సి ఉన్నా అటువంటి చర్యలు తీసుకునదాఖలాలు లేవని స్థానికులు మండిపడుతున్నారు. ముందుగా సమస్య ఉన్న ప్రాంతాలను యుద్ధప్రాతిపధిక గుర్తించాలని, అలాగే పారిశుద్ధ్యంపై అవగాహన చర్యలు, నిరంతర పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.
నీరు లేకుండా చూడాలి
ఇళ్ల మధ్యన చాలా కాలంగా నీరు నిలిచి ఉండడంతో దుర్వాసన వస్తోంది. పైగా ఈ మురికినీటి గుంటలు పందులకు ఆవాసాలు మారాయి. అధికారులు స్పందించి ఇళ్ల మధ్య మురుగు నీరు లేకుండా చర్యలు చేపడితే బాగుంటుంది. - రేణుక, గృహిణి
పిల్లలకు రోగాలు
ఇళ్ల మధ్య నీరు చేరడంతో దోమల బెడద ఎక్కువైంది. పిల్లలు అంటువ్యాధుల బారినపడుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మురుగు నీల్వ ఉండకుండా కాలువల గుండా బయటకు వెళ్లే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. - ఎల్లవ్వ