gajwel rural
-
మురుగుతో అవస్థలు
నివాసాల మధ్య మురుగు నీటి కుంటలు కొరవడిన పారిశుద్ధ్య నిర్వహణ రోగాల బారినపడుతున్న చిన్నారులు సమస్యను పరిష్కరించాలంటున్న స్థానికులు గజ్వేల్ రూరల్: ఇళ్ల పరిసరాలలో మురుగు నీరు నిలుస్తుందని... వాటిలో పందులు స్వైర విహారం, దోమల బెడదతో రోగాల బారిన పడుతున్నామని వాసవీనగర్ కాలనీవాసులు వాపోతున్నారు. నగర పంచాయతీ పరిధిలోని 2వ వార్డు వాసవీనగర్ కాలనీలోని పలు నివాస ప్రాంతాల మధ్య మురుగునీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలనీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే పల్లపు ప్రాంతంలోని నీరు పారదల లేక నిలిచిపోవడంతో కుంటగా తయారైంది. రోజుల తరబడి నీరు నిలిచిపోవడంతో పాచిపట్టి దుర్గంధం వెదజల్లుతోందని, దీనికితోడు పందులు సంచరిస్తుండటంతో దోమల బెడదల ఎక్కువైందని చెబుతున్నారు. కాగా వాసవీనగర్‌లోని పలుప్రాంతాల్లో నివాస గృహాల మధ్య పశువుల వ్యర్థ పదార్ధాలను నిల్వచేస్తుడటంతో పందుల సంచారం ఎక్కువైందని వివరించారు. మురికినీరు నిల్వ ఉండటంతో తమ మలేరియా, డెంగ్యూ లాంటి రోగాలు ప్రబలు తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. నగర పంచాయతి పరిధిలో నిరంతరం పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాల్సి ఉన్నా అటువంటి చర్యలు తీసుకునదాఖలాలు లేవని స్థానికులు మండిపడుతున్నారు. ముందుగా సమస్య ఉన్న ప్రాంతాలను యుద్ధప్రాతిపధిక గుర్తించాలని, అలాగే పారిశుద్ధ్యంపై అవగాహన చర్యలు, నిరంతర పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. నీరు లేకుండా చూడాలి ఇళ్ల మధ్యన చాలా కాలంగా నీరు నిలిచి ఉండడంతో దుర్వాసన వస్తోంది. పైగా ఈ మురికినీటి గుంటలు పందులకు ఆవాసాలు మారాయి. అధికారులు స్పందించి ఇళ్ల మధ్య మురుగు నీరు లేకుండా చర్యలు చేపడితే బాగుంటుంది. - రేణుక, గృహిణి పిల్లలకు రోగాలు ఇళ్ల మధ్య నీరు చేరడంతో దోమల బెడద ఎక్కువైంది. పిల్లలు అంటువ్యాధుల బారినపడుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మురుగు నీల్వ ఉండకుండా కాలువల గుండా బయటకు వెళ్లే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. - ఎల్లవ్వ -
బస్సుల కోసం రాస్తారోకో
గజ్వేల్ రూరల్: తమ కళాశాలల సమయానికి మరిన్ని బస్సులను నడిపించాలని కోరుతూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టిన సంఘటన శనివారం మండల పరిధిలోని జాలిగామలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించేందుకు ప్రతి నిత్యం గజ్వేల్ పట్టణానికి వస్తుంటారు. అయితే ఈ గ్రామం మీదుగా దౌల్తాబాద్ వరకు బస్సులు నడుస్తున్నాయి. కానీ ఉదయం వివిధ గ్రామాల నుంచి జాలిగామకు వచ్చే సరికి బస్సులన్నీ ప్రయాణికులు, విద్యార్థులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో జాలిగామ గ్రామానికి చెందిన విద్యార్థులు బస్సుల్లో ఎక్కేందుకు సైతం స్థలం లేకపోవడంతో గ్రామంలో ఆపకుండానే ముందుకుపోతున్నాయని ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం కళాశాల ముగిసిన అనంతరం తమ గ్రామానికి వెళ్లేందుకు బస్టాండ్‌లో బస్సు ఎక్కితే తమని దించివేశారని, రాత్రి వరకు అక్కడే ఉండాల్సి వచ్చిందన్నారు. ప్రతి నిత్యం మా గ్రామం మీదుగానే ఇతర గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నప్పటికీ మమ్మల్ని మాత్రం ఎక్కించుకోవడం లేదని, ఇదే విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ అధికారులు ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించేందుకు అదనపు బస్సులను నడిపించాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. -
మితిమీరిన విద్యార్థుల ఆగడాలు
పాఠశాల ఫర్నీచర్ ధ్వంసం తల్లిదండ్రులకు చెప్పిన మారని పరిస్థితి ధ్వంసం చేస్తే చర్యలు తప్పవన్న అధికారులు గజ్వేల్ రూరల్: ఆకతాయిల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఊరి చివరన పాఠశాల ఉండటతో ఏం చేసినా అడిగేవారుండరన్న దీమాతో పాఠశాలను ధ్వంసం చేస్తున్నారు. విలువైన ఫర్నిచర్‌ను పనికిరాకుండా చేశారు. ప్రధాన గేటును సైతం విడిచిపెట్టలేదు. ఈ విషయాన్ని వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయింది. వందల మంది చదువుకునే పాఠశాలలో ఆకతాయిల చేష్టల వల్ల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ పరిధిలోని కోట మైసమ్మ సమీపాన, జాలిగామ బైపాస్ రోడ్డు మార్గంలో గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో సుమారు 304 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే పట్టణ శివారులో ఉండడంతో పాఠశాల పనివేళలు ముగిసిన తర్వాత ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఇష్టారాజ్యంగా ఆవరణలో ఆటలాడటం, తరగతి గదుల్లోని కిటికీలు, తలుపులు విరగొట్టడంలాంటి పనులు చేస్తున్నారు. అంతేకాకుండా గదుల్లోని సీలింగ్ ఫ్యాన్ల రెక్కలను కూడా విరిచేశారు. ఇటీవల ఏర్పాటుచేసిన గేటును సైతం ధ్వంసం చేశారు. దీంతో పాఠశాలకు రక్షణ కరువైందని స్థానికులు మండిపడుతున్నారు. ఇదే విషయమై ప్రధానోపాధ్యాయురాలు శారద పాఠశాల సమీపంలో నివాసం ఉండే విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడం కూడా జరిగింది. అయినా పరిస్థితిలో ఎటువంటి మార్పురాలేదు. వాళ్ల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని ఆకతాయిల ఆగడాలకు కళ్లెం వేయడంతోపాటు పాఠశాలకు రక్షణ కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. రక్షణ కల్పించాలి పాఠశాల పనివేళలు ముగిసిన తర్వాత సాయంత్రం సమయంలో సమీప ప్రాంతాల పిల్లలు ఇక్కడికి వచ్చి ఆటలు ఆడుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. అంతేగాకుండా పాఠశాలలోని తరగతి గదులను, కిటికీలను ధ్వంసం చేశారు. ఇదే విషయాన్ని పాఠశాల సమీపంలోని విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. అయితే ఊరి చివరన ఈ పాఠశాల ఉండడం వల్ల ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయి. పాఠశాలకు రక్షణ కల్పించే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడితే బాగుంటుంది. - శారద, ప్రిన్సిపాల్, బాలికల ఉన్నత పాఠశాల గజ్వేల్ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే సహించం విద్యాలయాలను దేవాలయాలుగా భావించాలి అంతేకాని తమకు ఇష్టం వచ్చినట్లు పాఠశాలలోగల తలుపులు, కిటికీలను ధ్వంసం చేయడం సహించరానిది. పాఠశాలలకు రక్షణ కల్పించే విషయమై ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుంది. ప్రభుత్వ ఆస్తులను రక్షించడంతో పాటు ఆకతాయిల ఆగడాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. - సునీత, ఎంఈఓ