తరగతి గది తలుపు ధ్వంసం
- పాఠశాల ఫర్నీచర్ ధ్వంసం
- తల్లిదండ్రులకు చెప్పిన మారని పరిస్థితి
- ధ్వంసం చేస్తే చర్యలు తప్పవన్న అధికారులు
గజ్వేల్ రూరల్: ఆకతాయిల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఊరి చివరన పాఠశాల ఉండటతో ఏం చేసినా అడిగేవారుండరన్న దీమాతో పాఠశాలను ధ్వంసం చేస్తున్నారు. విలువైన ఫర్నిచర్‌ను పనికిరాకుండా చేశారు. ప్రధాన గేటును సైతం విడిచిపెట్టలేదు. ఈ విషయాన్ని వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయింది. వందల మంది చదువుకునే పాఠశాలలో ఆకతాయిల చేష్టల వల్ల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు.
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ పరిధిలోని కోట మైసమ్మ సమీపాన, జాలిగామ బైపాస్ రోడ్డు మార్గంలో గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో సుమారు 304 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే పట్టణ శివారులో ఉండడంతో పాఠశాల పనివేళలు ముగిసిన తర్వాత ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఇష్టారాజ్యంగా ఆవరణలో ఆటలాడటం, తరగతి గదుల్లోని కిటికీలు, తలుపులు విరగొట్టడంలాంటి పనులు చేస్తున్నారు.
అంతేకాకుండా గదుల్లోని సీలింగ్ ఫ్యాన్ల రెక్కలను కూడా విరిచేశారు. ఇటీవల ఏర్పాటుచేసిన గేటును సైతం ధ్వంసం చేశారు. దీంతో పాఠశాలకు రక్షణ కరువైందని స్థానికులు మండిపడుతున్నారు. ఇదే విషయమై ప్రధానోపాధ్యాయురాలు శారద పాఠశాల సమీపంలో నివాసం ఉండే విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడం కూడా జరిగింది. అయినా పరిస్థితిలో ఎటువంటి మార్పురాలేదు. వాళ్ల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని ఆకతాయిల ఆగడాలకు కళ్లెం వేయడంతోపాటు పాఠశాలకు రక్షణ కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
రక్షణ కల్పించాలి
పాఠశాల పనివేళలు ముగిసిన తర్వాత సాయంత్రం సమయంలో సమీప ప్రాంతాల పిల్లలు ఇక్కడికి వచ్చి ఆటలు ఆడుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. అంతేగాకుండా పాఠశాలలోని తరగతి గదులను, కిటికీలను ధ్వంసం చేశారు. ఇదే విషయాన్ని పాఠశాల సమీపంలోని విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. అయితే ఊరి చివరన ఈ పాఠశాల ఉండడం వల్ల ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయి. పాఠశాలకు రక్షణ కల్పించే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడితే బాగుంటుంది. - శారద, ప్రిన్సిపాల్, బాలికల ఉన్నత పాఠశాల గజ్వేల్
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే సహించం
విద్యాలయాలను దేవాలయాలుగా భావించాలి అంతేకాని తమకు ఇష్టం వచ్చినట్లు పాఠశాలలోగల తలుపులు, కిటికీలను ధ్వంసం చేయడం సహించరానిది. పాఠశాలలకు రక్షణ కల్పించే విషయమై ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుంది. ప్రభుత్వ ఆస్తులను రక్షించడంతో పాటు ఆకతాయిల ఆగడాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. - సునీత, ఎంఈఓ