గజ్వేల్ రూరల్: తమ కళాశాలల సమయానికి మరిన్ని బస్సులను నడిపించాలని కోరుతూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టిన సంఘటన శనివారం మండల పరిధిలోని జాలిగామలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించేందుకు ప్రతి నిత్యం గజ్వేల్ పట్టణానికి వస్తుంటారు.
అయితే ఈ గ్రామం మీదుగా దౌల్తాబాద్ వరకు బస్సులు నడుస్తున్నాయి. కానీ ఉదయం వివిధ గ్రామాల నుంచి జాలిగామకు వచ్చే సరికి బస్సులన్నీ ప్రయాణికులు, విద్యార్థులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో జాలిగామ గ్రామానికి చెందిన విద్యార్థులు బస్సుల్లో ఎక్కేందుకు సైతం స్థలం లేకపోవడంతో గ్రామంలో ఆపకుండానే ముందుకుపోతున్నాయని ఆరోపించారు.
శుక్రవారం సాయంత్రం కళాశాల ముగిసిన అనంతరం తమ గ్రామానికి వెళ్లేందుకు బస్టాండ్‌లో బస్సు ఎక్కితే తమని దించివేశారని, రాత్రి వరకు అక్కడే ఉండాల్సి వచ్చిందన్నారు. ప్రతి నిత్యం మా గ్రామం మీదుగానే ఇతర గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నప్పటికీ మమ్మల్ని మాత్రం ఎక్కించుకోవడం లేదని, ఇదే విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు.
విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ అధికారులు ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించేందుకు అదనపు బస్సులను నడిపించాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు.