- 22 ఏళ్లుగా కళాప్రదర్శనలు
- పతకాలు, ప్రశంసాపత్రాలే ఆస్తులు
- అందని గుర్తింపు.. కరువైన ప్రొత్సాహం
చిట్యాల(భూపాలపల్లి): పేదరికం వెంటాడుతున్నా.. పరిస్థితులు వెక్కిరిస్తున్నా.. పోత్సహం కరువైనా..పట్టువిడవకుండా గత 22 ఏళ్లుగా కళామాతల్లిని నమ్ముకుని జీవిస్తున్నాడు ఆ వ్యక్తి. గ్రామీణ ప్రాంతాలలో కనుమరుగవుతున్న కళారంగానికి జీవం పోస్తూ..ఎన్నో నాటకాలు ప్రదర్శించి ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు భూపాలపల్లి జల్లా చిట్యాల మండలంలోని నైన్‌పాక గ్రామానికి చెందిన మోతె మల్లేష్. నిరుపేద బుడిగజంగం కులంలో పుట్టిన మల్లేష్ చిన్నప్పటి నుంచి నాటికల పట్ల మక్కువ పెంచుకుని జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చాడు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో కూడా పలు జిల్లాలో ధూంధాం సభలలో పాల్గొని పాటలు, మిమిక్రీ, ఏకపాత్రాభినేయంతో ప్రేక్షకులను ఊర్రూతలూగించాడు.
రాజు,రాణిపాత్రలకు కేరాఫ్ మల్లేష్..
నాటకాలలో రాజు, రాణి పాత్రలు నటించడంలో మల్లేష్‌కు ఎవరూ సాటి రారు. పాత్రలో లీనమై రక్తికట్టిస్తాడు. రామాయణం, సత్యహరిచ్చంద్ర, మార్కండేయ, వాలీసుగ్రీవుల వధ, శ్రీకృష్ణార్జునుల యుద్ధం, పాండవుల ఆరణ్య వాసం, సారంగధర, మాయల ఫకీరు లాంటి నాటకాలు ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో రాణించి ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలను అందుకున్నాడు.
కరువైన ప్రోత్సాహం
కళారంగమే ప్రాణంగా భావిస్తున్న మల్లేష్‌కు ప్రభుత్వం, అధికారుల ప్రోత్సాహం కరువు అవుతోంది. దీంతో కుటుంబపోషణ భారమై ఇటు కళాప్రదర్శనలు నిర్వహిస్తూ సమయం దొరికినప్పుడల్లా గ్రామంలోనే ఆర్‌ఎంపీ వైద్యుడిగా సేవలందిస్తున్నాడు. కాగా, ప్రభుత్వాస్పత్రులలో మెరుగైన వైద్యం అందడంతో రోగులు తమ వద్దకు రావడం లేదని, దీంతో కుటుంబ పోషణ భారమైందని మల్లేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 22 ఏళ్లుగా కళాకారుడిగా రాణిస్తున్న తనను రాష్ట్ర ప్రభుత్వం ఆదరించి సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారిలను వేడుకుంటున్నాడు.
కళారంగ కనకం మల్లేష్..
Published Sun, Apr 30 2017 8:33 PM | Last Updated on Tue, Sep 5 2017 10:04 AM
Advertisement