రాయల వైభవాన్ని తలపించిన నాటిక పోటీలు
రాయల వైభవాన్ని తలపించిన నాటిక పోటీలు
Published Sat, Dec 24 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 11:31 PM
– డిప్యుటీ సీఎం కె.ఇ.కృష్ణమూర్తి
కర్నూలు(కల్చరల్): తానా అసోసియేషన్ నాటిక పోటీలు అలనాటి రాయల వైభవాన్ని తలపించాయని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి అన్నారు. స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తానా సంస్థ అమెరికాలో తెలుగు భాషా సంస్కృతిని పరిరక్షిస్తూనే ఆంధ్ర దేశంలోని పలు ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. కర్నూలు జిల్లాలోనూ తానా పలు చోట్ల పేదల కాలనీలు నిర్మించేందుకు సహకరించిందన్నారు. రాయలసీమలో తొలిసారిగా నాటక పోటీలను నిర్వహించి తానా సంస్థ స్థానిక కళాకారులకు చక్కని ప్రోత్సాహాన్ని అందించిందన్నారు. కళాకారుల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం మూడు రోజులుగా సాగిన తానా నాటిక పోటీల్లో విజేతలైన కళాకారులకు తానా అధ్యక్షులు జంపాల చౌదరి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, తానా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరాం, నియమిత అధ్యక్షులు సతీష్ వేమన, ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ, ప్రముఖ పారిశ్రామికవేత్త టి.జి.భరత్, తానా సహాయ కార్యదర్శి రవి పొట్లూరి, ప్రోగ్రామ్ కన్వీనర్ ముప్పా రాజశేఖర్, న్యాయ నిర్ణేతలు గురుస్వామి, వన్నెం బలరామ్, సుభాన్ సింగ్, లలిత కళాసమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కార్యదర్శి మహమ్మద్ మియ, సహాయ కార్యదర్శి ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ నాటకంగా 'అనగనగా'..
స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో మూడు రోజులుగా సాగిన నాటక పోటీలలో యంగ్ ఆర్ట్ థియేటర్స్ విజయవాడ వారు ప్రదర్శించిన అనగనగా.. నాటిక ఉత్తమ నాటికగా ఎంపికయ్యింది. ద్వితీయ ఉత్తమ నాటికగా అభినయ ఆర్ట్స్ గుంటూరు వారు ప్రదర్శించిన రెండు నిశ్శబ్దాల మధ్య, ఉత్తమ తృతీయ నాటికగా సాయి ఆర్ట్స్ కొలకలూరు వారు ప్రదర్శించిన ఒక్క మాటే చాలు ఎంపికయ్యాయి.
Advertisement