నాటకం...జీవన ప్రతిబింబం | drama is mirror image of life | Sakshi
Sakshi News home page

నాటకం...జీవన ప్రతిబింబం

Published Wed, Jan 18 2017 10:31 PM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM

నాటకం...జీవన ప్రతిబింబం

నాటకం...జీవన ప్రతిబింబం

–రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌
కర్నూలు(హాస్పిటల్‌): మానవ జీవితాన్ని ప్రతిబింబించేదే నాటకమని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలన చిత్ర టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్‌ మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలోనే రాష్ట్రస్థాయి నంది నాటక పోటీలు కర్నూలులో నిర్వహించాల్సి ఉన్నా అప్పుడు సాధ్యం కాలేదన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర కోస్తాలో విజయనగరం, దక్షిణ కోస్తాలో గుంటూరు, రాయలసీమలో కర్నూలు కేంద్రంగా ఈ పోటీలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు. కళాకారులను ప్రోత్సహించే ప్రాంతాలు సుభిక్షంగా ఉంటాయని చరిత్ర చెబుతుందన్నారు. రాయలసీమ కల్చరల్‌ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక కళలను, కళాకారులను ప్రోత్సహిస్తామన్నారు.
 
       హౌస్‌ ఫర్‌ ఆల్‌ స్కీమ్‌ కింద కళాకారులకు కర్నూలులో 10వేల గృహాలను నిర్మిస్తున్నట్లు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి చెప్పారు. ఎన్టీఆర్‌ వర్ధంతి రోజున నాటకోత్సవాలను ప్రారంభించం అభినందనీయమని  ఎమ్మెల్సీ ఎం. సుధాకర్‌బాబు అన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి పోటీల్లో 276 బృందాలు పాల్గొంటున్నాయన్నారు. కళాకారులకు ఇస్కాన్‌ సంస్థ సహాయంతో భోజనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, కేడీసీసీబీ చైర్మన్‌ మల్లికార్జున రెడ్డి, మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన్‌ శమంతకమణి, ఆర్‌డీవో రఘుబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్రబాబు, నాటకోత్సవాల నిర్వాహకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
 
 చప్పగా సాగిన నాటకోత్సవాలు
రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలకు సరైన ప్రచారం లేకపోవడంతో బుధవారం ప్రేక్షకులు లేక చప్పగా సాగింది. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ఎలాంటి ముందస్తు ప్రచారం లేకపోవడంతో కళలపై అభిమానం ఉన్న వారు రాలేకపోయారన్న వాదన వినిపించింది. సాక్షాత్తూ వేదికపై ఉన్న వారు సైతం నాటకాలకు జనం లేకపోవడాన్ని తప్పుబట్టారు. 
 
ఆలోచింపజేసిన నాటికలు..
నంది నాటకోత్సవాల్లో భాగంగా స్థానిక సి.క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన సాంఘిక నాటికలు ఆలోచింపజేశాయి. సమాజంలో జరుగుతున్న సాంఘిక దురాచారాలపై ఈ నాటికలను తమ కోణాన్ని చూపాయి. దురాచారాల వల్ల కలిగే నష్టాలు, ఇబ్బందులు, ఫలితం గురించి వివరించాయి. మొదటిరోజు ఐదు నాటికలకు గాను నాలుగు మాత్రమే జరిగాయి. కళాకారులు రాకపోవడంతో బ్రతికించండి అనే సాంఘిక నాటికను రద్దు చేశారు. 
  • వరకట్న దురాచారంపై బాపూజీ స్కౌట్‌ గ్రూప్‌ వారి ‘ఆశా–కిరణ్‌’ అనే సాంఘిక నాటిక ఆలోచింపజేసింది.
  •  అప్పులు తీసుకుని ఎగ్గొట్టే వారు చివరికి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారనే అంశంపై శ్రీ మురళి కళానిలయం ఆధ్వర్యంలో ‘అం అః–కం కః’ అనే సాంఘిక నాటకం నవ్వుల పువ్వులు పూయించింది. సినీ నటుడు జెన్నీఫర్‌ ఈ నాటికలో నటించారు.
  • చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో ‘అగ్నిపరీక్ష’ అనే సాంఘిక నాటకం..మంచి సందేశాన్ని ఇచ్చింది. 
  • బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులను, కుటుంబసభ్యులను మరిచిపోయే వారు.. చివరికి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారనే అంశంపై ప్రభు ఆర్ట్స్‌ నల్గొండ వారి ఆధ్వర్యంలో ‘ఐదో దిక్కు’ అనే సాంఘిక నాటకం ప్రదర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement