
కోరలు చాచిన కరువు
– పశ్చిమ ప్రాంతాన్ని కరుణించని వరుణుడు
– ఆదోని డివిజన్‌లో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం
– పూర్తిగా ఎండిన వేరుశనగ, మొక్కజొన్న, కొర్ర పంటలు
– కర్నూలు డివిజన్‌లోనూ వర్షాలు నామమాత్రమే...
కర్నూలు(అగ్రికల్చర్):
జిల్లాను కరువు కమ్మేస్తోంది. రెండు రోజుల పాటు వర్షాలు కురిసినా పూర్తి స్థాయిలో ప్రయోజనం లేదు. జిల్లాలో రెండు రోజుల పాటు నమోదైన వర్షంపాతం ఎండుతున్న పంటలను కాపాడలేకపోయింది. ఆదోని, కర్నూలు రెవెన్యూ డివిజన్‌లలోని పలు మండలాల్లో ఆగస్టు నెలలో వర్షాలు నామమాత్రంగా పడటంతో పంటలు ఎండిపోతున్నాయి. ఆదోని డివిజన్‌లో ఖరీఫ్ పంటల పరిస్థితి దయనీయంగా ఉంది. నెల రోజుల పాటు వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే వేరుశనగ, కొర్ర, మొక్కజొన్న పంటలు పూర్తిగా ఎండిపోయాయి. ప్రస్తుతం అధికార యంత్రాంగం ఆదోని డివిజన్‌పైనే దష్టి సారించింది. కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్‌లకు చెందిన నోడల్ ఆఫీసర్లు, మండల వ్యవసాయాధికారులను ఆదోని డివిజన్‌లోని ఆలూరు, ఆస్పరి, హాలహర్వి మండలాలకు తరలించారు. నోడల్ అధికారులు, వ్యవసాయాధికారులు గ్రామాలకు వెళ్లి పంటల పరిస్థితిని పరిశీలించి రెయిన్‌గన్‌ల ద్వారా పంటలను ఎంతవరకు కాపాడవచ్చు అనేదానిని అంచనా వేస్తారు.
అంతా హడావుడే...
ఆదోని డివిజన్‌లో అన్ని మండలాల్లో దుర్బిక్ష పరిస్థితులు ఏర్పడినా జిల్లా యంత్రాంగం మాత్రం ఆలూరు, చిప్పగిరి, ఆస్పరి, మద్దికెర, హాలహర్వి మండలాలపై దష్టి సారించింది. పలు మండలాల్లో రెయిన్‌గన్‌లతో పంటలను తడపడం సాధ్యం కావడం లేదు. ఆదోని డివిజన్‌లోని ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో పంటలకు తీరని నష్టం జరిగింది. ఆదోని రెవెన్యూ డివిజన్‌లోనే వర్షాభావంతో 2 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. లక్ష ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతింది. ఊడలు దిగి కాయలు ఏర్పడాల్సిన సమయంలో నెల రోజుల పాటు వర్షాలు లేకపోవడంతో మొక్కలు ఎండిపోయాయి. కొర్ర, మొక్కజొన్న వంటి పంటలకు పొట్ట దశలో వర్షాలు పడకపోవడంతో కంకి బయటకి రాలేదు. 15 రోజుల క్రితం అధికార యంత్రాంగం చొరవ తీసుకుని రెయిన్‌గన్‌లతో పంటలకు నీటి తడులు ఇచ్చి ఉంటే కొంత ఉపయోగం లేదు. చివరికి వరుణుడికి కరుణ కలుగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
41 శాతం వర్షపాతం లోటు..
ఖరీఫ్ పంటలకు ఆగస్టు నెల అత్యంత కీలకమైనది. ఈ నెలలోనే వర్షాలు జాడలేకపోవడంతో రైతుల ఆశలు తారుమారయ్యాయి. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 135 మి.మీ ఉండగా కేవలం 80.1 మిమీ మాత్రమే నమోదైంది. అది కూడా నెల చివరిలో కురిసిన వర్షాలతో ఈ స్థాయికి చేరింది. ఆగస్టు నెలలో వర్షపాతం 41 శాతం లోటు ఏర్పడింది. 45 మండలాల్లో వర్షాలు సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే ఉన్నాయి. ఆదోని డివిజన్‌లో ఒక్క మండలంలోను సాధారణ వర్షపాతంలో సగం కూడా నమోదు కాలేదు.
ఆదోని డివిజన్‌లో ఆగస్టు నెల వర్షపాతం వివరాలు (మి.మీ.లలో)
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
మండలం సాధారణ నమోదైన లోటు
వర్షపాతం వర్షపాతం ( శాతం)
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
హŸళగొంద 191 38.8 80
కౌతాళం 137 61.2 55
పెద్దకడుబూరు 144 37.8 74
కోసిగి 117 40.4 65
మంత్రాలయం 134 20.8 84
ఆలూరు 140 15.0 89
హాలహర్వి 76 11.0 86
నందవరం 144 18.4 87
గోనెగండ్ల 167 37.4 78
దేవనకొండ 232 52.6 77
ఆదోని 104 46.4 55
చిప్పగిరి 97 17.2 82
మద్దికెర 84 19.2 77
ఆస్పరి 136 22.2 84
పత్తికొండ 90 13.2 85
తుగ్గలి 95 47.2 50
ఎమ్మిగనూరు 103 56.0 46
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
కర్నూలు డివిజన్‌లో...
కర్నూలు రెవెన్యూ డివిజన్‌లోను వర్షాలు కొంత నిరాశనే మిగిల్చాయి. డోన్, ప్యాపిలి, క్రిష్ణగిరి, సి.బెళగల్, వెల్దుర్తి, గూడూరు మండలాల్లో వర్షాలు తేలికపాటికే పరిమితమయ్యాయి. ఈ మండలాల్లోను పంటల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ మండలాల్లో రెయిన్‌గన్‌లను ఉపయోగించి పంటలకు నీటి తడులు ఇచ్చే కార్యక్రమానికి స్వస్తి పలుకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.