రూ.1000 కోట్లు తాగేస్తున్నారు..
ఇదీ జిల్లాలో మద్యం ప్రియుల తాగుడు ఖర్చు
ఇళ్లు, ఒళ్లు గుల్లవుతున్నా పట్టించుకోరు
మద్యపాన సేవకుల సంఖ్యా అధిరోహణమే
రోజువారీ సంపాదనలో సగానికి పైగా జల్సాలకే
భీమవరం టౌన్:
జిల్లాలో గ’మ్మత్తు’ ఖర్చు ఏటా రూ.1200 కోట్ల వరకు ఉంటోంది. మద్యపాన ప్రియులు చేసే ఈ ఖర్చుతో గుండ్లకమ్మ, తాడిపూడి వంటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేయవచ్చు. లేదంటే తోటపల్లి, తారకరామతీర్థ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయవచ్చు. ఇది కూడా కాదంటే ముసురుపల్లి, పుష్కర, మధ్య పెన్నార్ దక్షిణ కాలువ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయవచ్చు. అంటే మద్యం కోసం జిల్లాలో ప్రజలు ఎంతగా దుబారా చేస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
మరో కోణంలో చూసినా జిల్లాలో మద్యం ప్రియులు చేసే ఖర్చుతో పేద రోగుల పాలిట సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకానికి ఊపిరి పోసి వేలాది మంది ప్రాణాలు కాపాడవచ్చు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బడ్జెట్‌కు అవసరమైన నిధులను ఈ ఒక్క జిల్లా నుంచే అందించవచ్చు. 108 సేవలకు 15 ఏళ్ల వరకూ సరిపడా ప్రతిపాదిత నిధులను కేటాయించవచ్చు. జిల్లాలో జీప్లస్ 3 తరహాలో ఏటా 40 వేల మంది నిరుపేదలకు ఇళ్లు నిర్మించవచ్చు. ఆశ్చర్యంగా ఉందా ఇది అక్షరాలా నిజం. మద్యం ప్రియుల ఖర్చు గ్రాఫ్ ఏటా పెరుగుతూనే ఉంది. మద్యం మత్తులో జోగే వారి సంఖ్య ఏటా పెరుగుతుండడంతో దానికి తగినట్లే రూ.100 కోట్లు అదనంగా ఖర్చు పెరుగుతోంది. ఇలా ఏటా జిల్లాలో రూ.1000 కోట్లు పైగా తాగుడుకు తగలేస్తున్నారంటే నమ్మక తప్పని పరిస్థితి.
వ్యసనం మత్తులో ఇళ్లు, ఒళ్లు గుల్లవుతున్నా ఏటా మందుబాబులు చేస్తున్న ఖర్చు మాత్రం తగ్గడం లేదు. దీని తాలూకా గ్రాఫ్ రేటు ఏయేటి కాయేడు పెరుగుతూనే ఉంది. ఇందులో అధిక సంఖ్యలో యువత ఉండడం దిగ్భ్రాంతిని కలిగించే విషయం. ఉన్నత వర్గాలు, పేద వర్గాలు సైతం నెలవారి, రోజు వారి సంపాదనలో సగానికి పైగా జల్సాలకే వెచ్చిస్తుండగా వాటిలో మద్యం ఖర్చు పరిశీలిస్తే తల తిరుగుతోంది. జిల్లాలో మద్యం ప్రియులు నెలకు రూ.వంద కోట్లకు, రోజుకు రూ.3.35 కోట్లు లెక్కన ఖర్చు చేస్తున్నారు. 2005 వరకూ భీమవరం పట్టణంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఉండేది కాదు. ఆ తరువాత ఇక్కడి ఆదాయం చూసి ఆ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో 430 మద్యం దుకాణాలుండగా భీమవరం ఎక్సైజ్ పరిధిలోనే సుమారు 238 ఉన్నాయి.
జిల్లాలో మద్యం అమ్మకాలు
200304లో రూ.187.16 కోట్లు
200405లో రూ.217.93 కోట్లు
200506లో రూ.300 కోట్లు
జిల్లాలో మద్యం అమ్మకాలు
201415లో రూ.1014 కోట్లు
201516లో రూ.1111 కోట్లు
201617లో రూ.1208 కోట్లు