- చిన్న ఐనం గ్రామంలో తాగునీటి సమస్య
- పని చేయని చేతిపంపులు
- పట్టించుకోని అధికారులు
వాగునీరే తాగాలా..?
Published Fri, Jul 29 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
దహెగాం : ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా మా బతుకులు, తలరాతలు మాత్రం ఇంకా అట్లనే ఉన్నాయి. కాలమేదైనా నీటి గోస మాత్రం తీరడం లేదు. ఎక్కడైనా ఎండకాలంలో తాగు నీటి సమస్య ఉంటుంది కానీ మా గ్రామ ప్రజలు అన్ని కాలల్లో తాగు నీటికి గోస పడుతుంటారు, వానకాలం ఊరిపక్కనున్న వాగు నీరే మాకు దిక్కు, వాగు నీరే మేము తాగాలా అని మండలంలోని చిన్న ఐనం గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. మండల కేంద్రానికి సమీపంలో ఉన్న గ్రామం చిన్నఐనం. గ్రామంలో తీవ్ర తాగు నీటి ఎద్దడి ఉందని గ్రామస్తులు లె లుపుతున్నారు. గ్రామంలో సుమారు 70 కుటుంబాలు ఉండగా జనాభా 350.
పనిచేయని చేతిపంపులు
గ్రామంలో ఉన్న మూడు చేతిపంపుల్లో ఒక్కటి మాత్రమే పని చేస్తోందని, పని చేస్తున్న చేతిపంపు నుంచి నీరు మురుగుగా వస్తోందని తెలుపుతున్నారు. ఆ నీటిని తాగలేకపోతున్నామని వాపోతున్నారు. 40 వేల లీటర్ల సామర్థ్యం గల తాగు నీటి పథకం ఉన్నా చిన్న చిన్న మరమ్మతులు చేపట్టకపోవడంతో అది కూడా నిరుపయోగంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెల్లవారు జామున ఎడ్లబండ్లలో డ్రమ్ములు పెట్టుకొని వాగు వద్దకు పోతున్నామని తెలిపారు. కాలకత్యాలు సైతం వాగు వద్ద తీర్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు. వంట బోళ్లు సైతం వాగు వద్దనే శుభ్రం చేసుకుంటున్నామని తాగునీటి వెతలు వివరిస్తున్నారు
వ్యాధుల సీజన్...
అసలే వర్షాకాలం వ్యాధుల సీజన్ కావడంతో వాగు నీరు తాగడం వల్ల పలు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. అయినా తప్పని పరిస్థితుల్లో వాగు నీటినే తాగుతున్నామని పేర్కొంటున్నారు. గత్యంతరం లేక వాగులో చెలిమె తోడి అందులోంచి నీటి బిందెల్లోకి నింపుకొని తాగుతున్నామని తెలియజేస్తున్నారు.
వర్షాకాలం కావడంతో వాగులో వరద నీరు వచ్చినప్పుడు కూడా అదే మురుగు నీరు తాగుతున్నామని పేర్కొంటున్నారు.
పట్టించుకోని అధికారులు...
గ్రామంలో తాగు నీటి ఇబ్బంది ఉందని, వాగు నీరు తాగుతున్నామని పలుసార్లు మండల అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులకు, నాయకులకు పట్టింపు లేదని మండిపడుతున్నారు. అధికారులు మా గ్రామం వైపు కన్నెత్తి చూడడం లేదని వాపోతున్నారు. తాగు నీటి సమస్య ఉందని పలుసార్లు ఎంపీడీవోకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా గ్రామంలో నెలకొన్న తాగు నీటి సమస్యను తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Advertisement
Advertisement