కనకదుర్గమ్మా.. గొంతునింపమ్మా..
కనకదుర్గమ్మా.. గొంతునింపమ్మా..
Published Fri, Sep 2 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
విజయవాడ (ఇంద్ర కీలాద్రి) :
దుర్గగుడి అధికారుల తీరుతో భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఇంతకాలం నిలువ నీడ మాత్రమే లేకుండా పోగా, తాజాగా కనీసం తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. శుక్రవారం దుర్గమ్మ దర్శనానికి నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వారు అధికంగా ఉంటారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మహామండపం దిగువన కౌంటర్లలో ప్రసాదాలు కొంటారు. అయితే, అమ్మ ప్రసాదం స్వీకరించిన తర్వాత గొంతు తడుపుకొనేందుకు మంచినీరు తాగుదామంటే కుళాయిల నుంచి చుక్కనీరు రావడం లేదు. దీంతో మహామండపానికి ఈశాన్య భాగంలో ఏర్పాటుచేసిన పైపు నుంచి వచ్చే నీటిని తాగేందుకు భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉన్న ఒక్క కుళాయి వద్ద పదుల సంఖ్యలో భక్తులు బారులు తీరుతున్నారు. అధికారులు అమ్మవారి ఆలయానికి వచ్చే ఆదాయంపై కాకుండా భక్తుల సదుపాయాలు, సౌకర్యాలపై దృష్టిసారిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement