అడిగిన వారందరకీ డ్రిప్
Published Wed, Feb 22 2017 12:09 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
- వంద శాతం లక్ష్య సాధనకు కృషి
- రైతులకు సహకరించని కంపెనీలకు జరిమానా
-ఏపీఎంఐపీ పీడీ వెల్లడి
కర్నూలు(అగ్రికల్చర్): అడిగన వారందరికి బిందు సేద్యం సదుపాయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సూక్ష్మ సేద్యం లక్ష్యాలను వందశాతం సాధించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది 15వేల హెక్టార్లకు డ్రిప్ సదుపాయం కల్పించాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.10,500 హెక్టార్లకు పూర్తయిందన్నారు. గత ఏడాది ఇదే సమయానికి కేవలం 5వేల హెక్టార్లకు మాత్రమే డ్రిప్ కల్పించామన్నారు. డ్రిప్ కల్పనలో కర్నూలు జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో ఉందని తెలిపారు. ఈ ఏడాది ముగింపునకు 45 రోజుల సమయం ఉందని, రోజుకు 100 హెక్టార్ల ప్రకారం మంజూరు చేసి డ్రిప్ పరికరాలు అమర్చాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలిపారు. మార్చి నెల చివరి నాటికి లక్ష్యం మేరకు డ్రిప్ సదుపాయం కల్పిస్తామన్నారు. డ్రిప్ కంపెనీలు కూడా నిర్వహణలో ఎలాంటి లోపం లేకుండా చూడాలని తెలిపారు. నిర్వహణలో రైతులకు సహకరించని 19 కంపెనీలకు రూ.4.80 లక్షలు జరిమానా విధించినట్లు చెప్పారు. స్ప్రింక్లర్ల కంటే డ్రిప్ విధానాన్నే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వివరించారు. సూక్ష్మ సేద్యం వల్ల కలిగే ఉపయోగాలు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు తదితర వాటిపై రైతులకు అవగాహన కల్పించడం ద్వారా లక్ష్యాలను అధికమిస్తామన్నారు. .
Advertisement