- కరువు పరిస్థితుల నేపథ్యంలో ఎండుతున్న పంటలు
- అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యలు
- జిల్లాలో 15 మందికిపైగా బలవన్మరణాలు
- ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘాల వేడుకోలు
- గతనెలలో నారాయణఖేడ్ మండలం నర్సాపూర్ చిన్నతండాకు చెందిన లక్ష్మణ్(46) అనే గిరిజన రైతు అప్పులు తాళలేక పొలంలోనే చెట్టుకు ఉరేసుకున్నాడు.
- కొండపాక మండలం వెలికట్టలో సత్తయ్య(45) అనే రైతు పురుగుల మందు తాగి చనిపోయాడు.
- మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన రైతు మల్లయ్య(53) చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
- జగదేవ్‌పూర్ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన రైతు గడ్డం సత్తయ్య(46) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.
- ఇటీవల పుల్కల్ మండలం సారాపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు అనంతయ్య, చౌటకూరు గ్రామానికి చెందిన లక్ష్మణ్ అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
సాక్షి, సంగారెడ్డి: వరుస కరువుల తర్వాత ఖరీఫ్ సాగుతో గట్టెక్కుతామనుకున్న రైతుల ఆశలు క్రమంగా ఆవిరవుతున్నాయి. వరుణుడు ముఖం చాటేయటంతో పంటలు ఎండిపోతున్నాయి. పెట్టుబడుల కోసం తీసుకున్న అప్పులు.. తీర్చే దారి లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
రైతన్నల ఆత్మహత్యలు
చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామానికి చెందిన రైతు దుర్గాగౌడ్.. తనకున్న నాలుగు ఎకరాల పొలంలో వరి, మొక్కజొన్న వేశాడు. అప్పులు చేసి మరీ సాగు చేశాడు. పంటలు మాత్రం చేతికి అందేలా కనిపించడం లేదు. దీంతో తీసుకున్న రూ.4 లక్షల అప్పు తీరే మార్గం లేక సోమవారం దుర్గాగౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొండపాక మండలం జప్తినాచారం గ్రామానికి చెందిన ఐతు చింతల మహేందర్(32) అప్పులబాధ తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలో కమ్ముకొస్తున్న కరువుఛాయలకు వీరిద్దరి ఆత్మహత్యలు అద్దం పడుతున్నాయి.
15 మందికి పైగా ఆత్మహత్య
ఖరీఫ్‌లో వర్షాలు కురిసినా.. పంటలు ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోతే రైతుల పరిస్థితి దయనీయంగా మారే ప్రమాదం ఉంది. ఈనేపథ్యంలోనే జిల్లాలో రైతులు, కౌలుదారుల ఆత్మహత్యల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల కాలంలో జిల్లాలో 15 మందికి పైగా రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
సడలుతున్న విశ్వాసం
ఈసారైనా ఖరీఫ్‌లో పంటలు చేతికివచ్చి అప్పులు తీరుతాయని రైతులు ఆశపడ్డారు. సీజన్ ఆరంభంలో వర్షాలు బాగా కురవడంతో వారంతా సాగు పనులు మొదలుపెట్టారు. అయితే, పంటలు కాయకాసే దశలో వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో పంటలు ఎండిపోయాయి. ముఖ్యంగా మొక్కజొన్న, వరి, జొన్న తదితర పంటల ఎండిపోగా.. పప్పుధాన్యాల దిగుబడి గణనీయంగా తగ్గింది.
జిల్లాలో గత ఏడాది 1.11 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగు కాగా.. ప్రస్తుత ఖరీఫ్‌లో 1.22 హెక్టార్లలో మొక్కజొన్న వేశారు. వర్షాలు లేకపోవటంతో 50 వేల హెక్టార్లకుపైగా మొక్కజొన్న ఎండిపోయింది. దీంతో రైతులు నష్టాన్ని చవిచూడాల్సివచ్చింది. మరోవైపు వరి పంటల పరిస్థితి ఇదే విధంగా ఉంది. దీంతో రైతులు ఆందోళన ఆందోళన చెందుతున్నారు.
ఇదిలా ఉండగా బ్యాంకులు రైతులకు సకాలంలో రుణాలు అందజేయని పరిస్థితి ఉంది. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో రూ.1,763 కోట్ల పంట రుణాలు పంపిణీ చేయాలని బ్యాంకులు లక్ష్యంగా నిర్థేశించుకోగా.. ఇప్పటి వరకు రూ.500 కోట్లకుపైగా మాత్రమే అందించాయి. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవటంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
అలాగే పంట రుణమాఫీ సొమ్ములు, పంట నష్టపరిహారం డబ్బులు సైతం రైతుల అందడం లేదు. పంటలు ఎండిపోవటానికి తోడు ఆర్థిక ఇబ్బందులు తలెత్తటంతో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అన్నదాతకు మనోధైర్యం చెప్పి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.