వరదలో చిక్కుకుని పశువుల కాపరి మృతి
దామరచర్ల
వరదలోచిక్కుకుని పశువుల కాపరి మృతిచెందాడు. ఈ ఘటన దామరచర్ల మండలం బాల్నెపల్లిలో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం మొల్కచర్ల గ్రామ పంచాయతీ పరిధి బాలాజీ తండాకు చెందిన సపావట్ హరి(38) బుధవారం పశువులను మేపుకుంటూ బాల్నెపల్లి సమీపంలోని కూలకుంట వాగు వద్దకు వెళ్లాడు. వర్షం బాగా కురుస్తుండడంతో వాగుపై ఉన్న కల్వర్టును దాటేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గూనలో చిక్కుకున్నాడు. వాగుకు ఎగువ ప్రాంత నుంచి భారీగావరద రావడంతో ఊపిరాడక మృతిచెందాడు. తోటి పశువుల కాపరులు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడికి భార్య సోమ్లి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వాడపల్లి పోలీసులు తెలిపారు.