
‘నా కుమారుడు డ్రగ్స్ తీసుకుంటాడు’
హైదరాబాద్: తన కుమారుడు విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతాడన్నది అవాస్తవమని మాదక ద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ మెస్సానస్ తండ్రి బెర్నార్డ్ తెలిపారు. తన కొడుకు డ్రగ్స్ తీసుకుంటాడు గానీ విక్రయించడని చెప్పారు. పోలీసులు తమ ఇంట్లో సోదాలు జరిపి కొంత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. కెల్విన్ కొరియర్ ద్వారా డ్రగ్స్ పంపిస్తే విద్యార్థులకు విక్రయించామని మరో ఇద్దరు నిందితులు అబ్దుల్ వహీబ్, అబ్దుల్ ఖుదూస్ వెల్లడించినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కెల్విన్‌తో రెండేళ్లుగా పరిచయం ఉందని, ఆరు నెలలుగా డ్రగ్స్ విక్రయిస్తున్నామని మీరు వెల్లడించారు.
ముగ్గురు నిందితులపై బాలనగర్, చార్మినార్ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. కెల్విన్‌పై బాలనగర్‌లో.. వహీబ్, అబ్దుల్ ఖుదూస్‌లపై చార్మినార్ పీఎస్‌లో కేసులు పెట్టారు. కాగా, వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు కెల్విన్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మెసేజ్ పంపిన అరగంటలో మత్తు పదార్థాలు సరఫరా చేశానని అతడు చెప్పినట్టు సమాచారం. సినీ పరిశ్రమ, పాఠశాల, కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ విక్రయించినట్టు సమాచారం.
ముగ్గురు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వీరికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. రెండు రోజుల్లో నిందితులను తమ కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా 25 మంది వీఐపీలను పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.