‘గోలీ’మాల్
►రుయా ఆస్పత్రిలో పక్కదారిపడుతున్న మందులు
►సిబ్బంది చేతివాటం ఓపీ లేకుండానే పంపిణీ
►పంపిణీ కేంద్రంలోకి వస్తున్న బయటి వ్యక్తులు
►‘సాక్షి’ నిఘాలో వెల్లడైన వాస్తవాలు
పేదలకు అందాల్సిన మందులు పక్కదారి పడుతున్నాయి. తిరుపతి రుయా ఆస్పత్రిలో కిందిస్థాయి సిబ్బంది చేతివాటంతో విలువైన ఔషధాలు ఆసుపత్రి దాటి బయటకు వెళుతున్నాయి. ఓపీ లేకపోయినా.. బయటివారిని లోపలికి రప్పించి మరీ విలువైన మందులు అందిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. సోమవారం ‘సాక్షి’ నిఘాలో ఈ అవినీతి బాగోతం బహిర్గతమైంది.
తిరుపతి (అలిపిరి):
ఏడుకొండలవాడి సాక్షిగా.. రోగులు అందరూ చూస్తుండగానే.. రుయాలో పనిచేసే సిబ్బంది మొదలుకుని.. బయటి వ్యక్తుల వరకు నేరుగా ముందుల పంపిణీ కేంద్రంలోకి వెళ్లి యథేచ్ఛగా మందులు తీసుకెళుతుంటా రు. ఇది మందుల కోసం నిరీక్షించే రోగులకు తెలిసిన నిత్య సత్యం.. శ్రీ వేంకటేశ్వర రామ్‌నారాయణ రుయా ఆసుపత్రికి రాయలసీమ నుంచే కాదు ఇతర జిల్లాల నుంచి వైద్యం కోసం పేదలు వస్తుంటారు. నిత్యం 1,300 నుంచి 2వేల మంది వరకు ఓపీ సేవలు పొందుతున్నారు. సోమవారం రోగుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఇక్కడ రోగులకు వైద్యంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. సేవా లక్ష్యం ప్రశంసనీయమే.. కానీ పేదలకు అందాల్సిన విలువైన మందులు పక్కదారి పడుతున్నాయి. కనీసం ఓపీ లేని వారికి కూడా మందులను పంపిణీ చేస్తున్నారు. రుయాలో పనిచేసే నర్సులు మొదలుకుని.. కింది స్థాయి సిబ్బంది వరకు నేరుగా ఫార్మసీలోకి వెళ్లి జేబులో మందులు వేసుకుని వెళుతున్నారు. విలువైన మందులు పక్కదారి పడుతున్న రుయా అధికారుల మాత్రం తమకేమీ తెలియదన్నట్లు వ్యహరిస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది.
నిబంధనలకు విరుద్ధం
ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తోంది. డాక్లర్ల ప్రిస్కెప్షన్ లేకుండా రోగులకు కూడా మందులు ఇవ్వకూడదు. బయటి వారికి ఎట్టిపరిస్థితులను మందులను చేరవేయకూడదు. ఇది ప్రభుత్వ నిబంధన. అయితే నిబంధనలకు విరుద్ధంగా రుయాలో మందులు బయటకు తరలివెళుతున్నాయి. ఇందులో అక్కడ పనిచేసే సిబ్బంది ప్రత్యక్ష పాత్ర వహిస్తున్నారు.
మందుల పంపిణీ గదిని పరిశీలిస్తాం
ప్రభుత్వ మందులను ప్రిస్కిప్షన్ లేకుండా ఇవ్వకూడదు. రుయాలో మందులు బయటకు వెళుతున్నాయని ఫిర్యాదులు అందలేదు. మందుల పంపిణీ గదిని పరిశీలిస్తాం. వాస్తవాలను తెలుసుకుంటాం. రుయా సిబ్బందికి చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే ఫార్మసీలో మందులు తీసుకోవడం సాధారణంగా జరుగుతుంది.
సాక్షి నిఘాలో బయటపడ్డ మందుల బాగోతం
రుయాలో రోగులకు మందులు పంపిణీ చేసే కేంద్రంపై సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘సాక్షి’ బృందం నిఘా ఉంచింది. ఈ నిఘాలో పలు విషయాలు బయటకు వచ్చాయి. రుయాలో పనిచేసే నర్సులు మొదలుకుని కింది స్థాయి సిబ్బంది వరకు మందులను బయటకు తీసుకెళుతున్నారు. బయటి వ్యక్తులను లోపలికి అనుమతించి మందులను అందిస్తున్నారు. రోగులకు అందాల్సిన విలువైన మందులు ఇలా పక్కదారి పడుతున్నాయన్న వాస్తవాలు సాక్షి నిఘాలో బయటపడింది.