డ్రగ్స్ ముఠాకు అధికార దన్ను | Drugs gang was backed by the ruling | Sakshi
Sakshi News home page

డ్రగ్స్ ముఠాకు అధికార దన్ను

Published Tue, Oct 14 2014 2:21 AM | Last Updated on Fri, May 25 2018 2:11 PM

డ్రగ్స్ ముఠాకు అధికార దన్ను - Sakshi

డ్రగ్స్ ముఠాకు అధికార దన్ను

  • జిల్లా కేంద్రంగా జోరుగా మాదక ద్రవ్యాల వ్యాపారం
  •  డ్రగ్స్ ముఠాపై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు
  •  ‘అధికార’ ఒత్తిళ్లతో ఇంటర్‌పోల్ హెచ్చరికలనూ పట్టించుకోని వైనం
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి: దేశంలో డ్రగ్స్ ముఠా ఎక్కడ పట్టుబడినా ఆ ముఠా మూలాలు జిల్లాతో ముడిపడి ఉండటం సంచలనం రేపుతోంది. డ్రగ్స్ ముఠాకు అడ్డుకట్ట వేయాలని ఇంటర్‌పోల్, కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు చేసినా పోలీసులు పట్టించుకోవం లేదు. అధికార టీడీపీ కీలకనేతలు డ్రగ్స్ ముఠాకు వెన్నుదన్నుగా నిలుస్తుండటం వల్లే పోలీసులు చర్యలు తీసుకోవడానికి సాహసించడం లేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. సెప్టెంబర్ 16న చెన్నై విమానాశ్రయం నుంచి రెండు కిలోల హెరాయిన్‌ను కువైట్‌కు ఎగుమతి చేయడానికి ప్రయత్నించిన స్మగ్లర్ వెంకటేశ్వరరావును అరెస్టు చేయడం కాదు కదా కనీసం ఆచూకీ కూడా కనుగొనే యత్నం చేయకపోవడమే అందుకు తార్కాణం.
     
    శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనాన్ని మయన్మార్, మలేషియా, హాంకాంగ్, థాయ్‌లాండ్‌కు అక్రమంగా ఎగుమతి చేస్తున్న స్మగ్లర్లు.. అక్కడి నుంచి దొడ్డిదారిన హెరాయిన్, బ్రౌన్ షుగర్ వంటి డ్రగ్స్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. ఆ డ్రగ్స్‌ను గల్ఫ్, శ్రీలంక, సహారా ఎడారి ప్రాంతంలోని దేశాలకు అక్రమంగా ఎగుమతి చేయడంతో పాటు దేశంలోనూ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు.

    మదనపల్లె, చిత్తూరు, పీలేరు, తిరుపతి కేంద్రంగా ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లే డ్రగ్స్ ముఠాకు నేతృత్వం వహిస్తున్నారు. ఆ ఇద్దరూ టీడీపీ నేతలు కావడం గమనార్హం. సెప్టెంబర్ 16న చెన్నైలోని మీనంబాకం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కువైట్ వెళ్లేందుకు సిద్ధమైన ఆనంద్‌ను ఎన్సీబీ(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు అదుపులోకి తీసుకు న్న విషయం విదితమే. అప్పటికే కార్గోలోకి వెళ్లిన అతని బ్యాగేజీలో పది గోధుమ పిండి పొట్లాల మధ్యలో ఉన్న రెండు కిలోల హెరాయిన్ ప్యాకెట్లను ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు.

    ఆనంద్‌ను విచారిస్తే.. ఆ ప్యాకెట్లను కువైట్‌లో తమ బంధువుకు చే ర్చాలని కేవీపల్లె మండలం చెరువుముందర కమ్మపల్లెకు చెందిన వెంకటేశ్వరరావు ఇచ్చాడని వెల్లడైంది. వెంకటేశ్వరరావును అరెస్టు చేయడం కోసం ఎన్సీబీ అధికారులు సెప్టెంబర్ 16 నుంచి 23 వరకూ జిల్లాలోనే మకాం వేశారు. జిల్లా పోలీసుల నుంచి సహా య నిరాకరణ ఎదురవడంతో వెంకటేశ్వరరావును ఎ న్సీబీ అధికారులు అదుపులోకి తీసుకోలేకపోయారు.
     
    మూలాలన్నీ జిల్లాలోనే..


    దేశంతోపాటు విదేశాల్లో భారతీయ డ్రగ్స్ స్మగ్లర్లు ఎక్కడ పట్టుబడినా.. ఆ మూలాలన్నీ జిల్లాతోనే ముడిపడి ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. డ్రగ్స్ ముఠా మూలాలన్నీ పశ్చిమ మండలాలతోనే ముడిపడటం ఉండగం గమనార్హం. దుర్భిక్షం వల్ల సేద్యం పడకేయడంతో ఉపాధి కోసం యువకులు గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. ఇదే సమయంలో స్మగ్లర్లు నిరుద్యోగ యువతకు వల వేసి డ్రగ్స్ స్మగ్లింగ్‌లోకి లాగుతున్నారు.

    బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు విజిటింగ్ వీసాలపై వలస వెళ్లే యువతీయువకులను గుర్తిస్తున్న స్మగ్లర్లు.. తాము ఇచ్చే బ్యాగేజీని వారికి అప్పగిస్తే భారీ ఎత్తున ముట్టచెబుతామంటూ లొంగదీసుకుంటున్నారు. డ్రగ్స్‌తో నింపిన బ్యాగేజీని వారి ద్వారా విదేశాల్లోని తమ ప్రతినిధులకు అప్పగిస్తూ.. మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని గుట్టుగా సాగిస్తున్నారు. మన దేశంలోనూ.. రాష్ట్రంలోనూ ఇదే రీతిలో వ్యాపారాన్ని సాగిస్తుండడం గమనార్హం. సెప్టెంబర్ 25, 2013న ఆరు కిలోల హెరాయిన్‌తో మదనపల్లెకు చెందిన చాయదేవి నైజీరియాలో పట్టుపడింది.

    చాయదేవి భర్త మదనపల్లె మున్సిపాలిటీలో టీడీపీ తరఫున కో-ఆప్షన్ సభ్యుడిగా పనిచేయడం గమనార్హం. ఈ ఏడాది మార్చి 8న అనంతపురంలోనూ.. మార్చి 15న కడపలోనూ డ్రగ్స్ విక్రయిస్తోన్న ముఠా ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ రెండు సంఘటనల్లోనూ చిత్తూరు జిల్లాకు చెందిన స్మగ్లర్ల అనుచరులే పట్టుబడ్డారు. ఇటీవల హైదరాబాద్‌లోనూ.. బెంగళూరులోనూ పది కిలోల హెరాయిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనల్లోనూ అర్టెయిన స్మగ్లర్లు చిత్తూరు జిల్లాకు.. అందులోనూ పశ్చిమ మండలాలకు చెందిన వారే కావడం గమనార్హం.
     
    స్మగ్లర్లకు అధికార దన్ను..

    జిల్లాలో డ్రగ్స్ ముఠా మూలాలు బలంగా ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఇంటర్‌పోల్ హెచ్చరించింది. కేంద్ర నిఘా వర్గాలు, ఎన్సీబీ అధికారులు జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. కానీ.. జిల్లా పోలీసు యంత్రాంగం మాత్రం డ్రగ్స్ స్మగ్లర్ల వైపు కన్నెత్తి చూసేందుకు కూడా సాహసించడం లేదు. కేవీపల్లె మండలం చెరువు ముందుర కమ్మపల్లెకు చెందిన వెంకటేశ్వరరావును అరెస్టు చేసేందుకు సహకరించాలని ఎన్సీబీ అధికారులు చేసిన విజ్ఞప్తిని సైతం పోలీసులు పట్టించుకోకపోవడమే అందుకు తార్కాణం. డ్రగ్స్ స్మగ్లర్లు, అనుచరుల మూలాలన్నీ టీడీపీతో ముడిపడి ఉండడం.. అధికారపార్టీకి చెందన అగ్రనేతలు ఒత్తిడి చేస్తోండటంతో జిల్లా పోలీసు యంత్రాంగం మిన్నకుండిపోతోంది. ఇదే అదునుగా తీసుకున్న స్మగ్లర్లు విజృంభిస్తోండటం గమనార్హం.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement