పోలీసు బందోబస్తు మధ్య మృతదేహాల తరలింపు | dual murders dead bodies police bandhobasth | Sakshi
Sakshi News home page

పోలీసు బందోబస్తు మధ్య మృతదేహాల తరలింపు

Published Sun, Mar 5 2017 11:20 PM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

పోలీసు బందోబస్తు మధ్య మృతదేహాల తరలింపు - Sakshi

పోలీసు బందోబస్తు మధ్య మృతదేహాల తరలింపు

నాటకీయ పరిణామాలు
అప్పగింత వద్ద ఉద్రిక్తత 
కాకినాడ క్రైం (కాకినాడ సిటీ): కాకినాడ రామారావుపేటలో ఈ నెల 2న హత్యకు గురైన  బడుగు బాల గంగాధరతిలక్‌ (బాలా), జగడం రామస్వామిల మృతదేహాలను పోలీసులు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య తరలించారు. హత్య జరిగిన గురువారం జంట మృతదేహాలకు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బాధితులకు రూ. 25 లక్షల నష్టపరిహారం అందజేయాలని, ఏ1 ముద్దాయిగా సుబ్బయ్య హోటల్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలనే డిమాండ్లతో బాధిత కుటుంబాల సభ్యులు, దళిత సంఘాల నేతలు ఆందోళన చేస్తున్నారు. ఈ మేరకు పోస్ట్‌మార్టం పూర్తయిన మృతదేహాలను మార్చురీ నుంచి తీసుకెళ్లేందుకు నిరాకరించడంతో నాలుగు రోజులుగా కాకినాడలో ఉద్రిక్త  పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయమై శనివారం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేసి, జేసీకి వినతి పత్రం అందించారు. సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్‌ను సంఘం నేతలు కలుసుకుని బాధితులకు న్యాయం చేయాలని , ఏ1 ముద్దాయిగా హోటల్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని కోరారు. ఎస్పీని కలిసిన అనంతరం సోమవారం ఛలో కాకినాడ నిర్వహిస్తున్నామని, ఉదయం 10 గంటలకు  కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తామని ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పకడ్బందీగా ప్రణాళిక రచించారు. ముందుగానే మృతదేహాలను తరలించేందుకు కార్పొరేషన్‌ నుంచి లెటర్‌ తీసుకున్నారు. ఆ తర్వాత ఆదివారం ఉదయం నుంచి జీజీహెచ్‌ మార్చురీ వద్ద భారీగా పోలీసు బలగాలను మొహరించారు. సాయంత్రం అయిదు గంటల నుంచి జిల్లాకు చెందిన సుమారు 600 మంది వరకూ ప్రత్యేక పోలీసు బలగాలు, పలు సబ్‌ డివిజినల్‌కు చెందిన సీఐలు, ఎస్సైలు, సిబ్బంది జీజీహెచ్‌కు చేరుకున్నారు. ఆఖరిసారిగా మృతదేహాలను తీసుకెళ్లాల్సిందిగా కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నేతలకు పోలీస్‌ అధికారులు  స్పష్టం చేశారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో 5.45 గంటలకు రెండు అంబులెన్స్‌లో పటిష్ట పోలీస్‌ బందోబస్తు నడుమ మృతదేహాలను వారి స్వస్థలాలు పెదపూడి మండలం రామేశ్వరం, కాకినాడ రామారావుపేటలోకి పంపిచేశారు. మృతదేహాలను తీసుకునేందుకు బాధిత బంధువులు నిరాకరించారు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల నడుమ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో సాయంత్రం 6 గంటలకు మృతదేహాలను ఎలా తీసుకొచ్చి అప్పగిస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజుల వ్యవధి ఇచ్చామని, పోస్ట్‌మార్టం పూర్తయిన తర్వాత నాలుగు రోజులు మార్చురీ వద్ద పడిగాపులు కాశామని, ఇక కుదరదని, కలెక్టర్, ఎస్పీల ఆదేశాల మేరకు మృతదేహాలను తరలించినట్టు కాకినాడ డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అనంతరం మృతదేహాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 500 మంది పోలీసులు పాల్గొన్నారు.
జంట హత్యల కేసులో పురోగతి
పోలీసుల అదుపులో అయిదుగురు నిందితులు
ఏ 2 ముద్దాయి కోసం గాలింపు 
కాకినాడ క్రైం (కాకినాడ సిటీ):  ఈ నెల 2న కాకినాడ రామారావుపేటలో జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య జరిగిన రోజునే పోలీసులకు లొంగిపోయిన ప్రధాన నిందితుడు జగన్నాథపురానికి చెందిన అడ్లబోయిన అశోక్‌కుమార్, ఆ తర్వాత పోలీసుల విచారణలో మరో అయిదుగురు పేర్లు చెప్పినట్టు çతెలిసింది. ఈ హత్యలో తనతో పాటూ మరో వ్యక్తి పాల్గొన్నట్టు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. రెండో నిందితుడు సుబ్బయ్య హోటల్‌ సమీపాన సతీష్‌ పేకర్స్, మూవర్స్‌ అనే పేరుపై వాహనాలను నడుపుతున్నట్టు ప్రధాన నిందితుడు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. హత్య జరిగిన రోజున కేటరింగ్‌లో వేన్‌లో నలుగురు వ్యక్తులు ఉన్నారని, వీరు హత్య జరిగిన తర్వాత అక్కడ నుంచి పరారైనట్టు తెలిసింది. ప్రధాన నిందితుడి వివరాల మేరకు ఇప్పటికే నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న నిందితుడు సతీష్‌ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇతన్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. త్వరలో రెండో ప్రధాన ముద్దాయిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. జంట హత్యల కేసులో లోతుగా సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని, ఈ కేసుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్నవారిని విచారిస్తున్నామని విచారణ అధికారి, డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.  

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement