మాటలకందని ప్రేమ! | Dumb pair love story | Sakshi

మాటలకందని ప్రేమ!

Published Sat, Apr 23 2016 9:32 AM | Last Updated on Fri, Jul 27 2018 12:33 PM

మాటలకందని ప్రేమ! - Sakshi

మాటలకందని ప్రేమ!

ఫేస్‌బుక్ ద్వారా పరిచయం
మాటల్లేవ్.. మాట్లాడు కోవడాల్లేవ్..
రోజూ చాటింగ్‌తో కలిసిన మనుసులు
28న వేంపల్లెలో వివాహం


వేంపల్లెకు చెందిన నాగార్జున కుమార్, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భవానీల మధ్య ఫేస్‌బుక్ ద్వారా మూడు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఉన్నత విద్యా వంతులే. అయితే వీరిద్దరికీ మాటలు రావు. ఇష్టాయిష్టాలు, అభిరుచులు, అలవాట్లు, కుటుంబ పరిస్థితులు.. ఒకటేమిటి అన్ని విషయాలు చాటింగ్ ద్వారా పరస్పరం పంచుకున్నారు. వారిద్దరూ ఇష్టపడ్డారు. వివాహానికి ఇంట్లో వారినీ ఒప్పించారు. 

వేంపల్లె :  వైఎస్‌ఆర్ జిల్లా వేంపల్లె పట్టణానికి చెందిన గోనుగుంట్ల లక్ష్మీనరసయ్య, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు నాగార్జున కుమార్ పుట్టుకతోనే మూగ చెవుడు ఉంది. పట్టుదలతో ఎంఏ వరకు చదివాడు. మూడు నెలల క్రితం ఒక రోజు అనుకోకుండా ఫేస్‌బుక్ ద్వారా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం చౌడవరం గ్రామానికి చెందిన పట్నాల సుబ్బారావు, సూర్యభాస్కరమ్మ దంపతుల కుమార్తె అనంతలక్ష్మీ భవాని ఆకట్టుకుంది. ఆమె కూడా పుట్టుకతోనే మూగ, చెవుడు అని తెలుసుకుని ఆమెతో చాటింగ్ ద్వారా మాట కలుపుదామనుకున్నాడు. రెండు మూడు ప్రయత్నాల తర్వాత ఆమె ఆన్‌లైన్‌లోకి వచ్చింది.

అప్పటి నుంచి రోజూ కంప్యూటర్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఇద్దరూ చాలా సేపు చాటింగ్ చేసుకున్నారు. పరస్పరం ఇద్దరి మనస్థత్వాలు నచ్చాయి. అన్ని విషయాలు చర్చించుకున్నారు. తొలుత పెద్దలు ససేమిరా అన్నప్పటికీ వారిని ఒప్పించారు. ఈ నెల 28న వేంపల్లెలోని వాసవి కళ్యాణమండపంలో ఉదయం 9 గంటలకు వీరి వివాహం ఘనంగా జరిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

చాటింగ్‌లో కొన్ని విషయాలు..

 నాగార్జునకుమార్ (నాగ్) : హాయ్.. నా పేరు నాగార్జున కుమార్.. మీ పూర్తి పేరు తెలుసుకోవచ్చా..

 భవాని : ఎవరు మీరు.. నా పేరు ఎందుకు చెప్పాలి?

 నాగ్ : మీ ఇష్టమండీ.. ఎందుకో తెలుసుకోవాలనిపించింది..

 భవాని : నా పేరు భవాని.. అనంతలక్ష్మి భవాని..

 నాగ్ : మీరు ఏం చదువుకున్నారు..

 భవాని : బి.ఏ.,

 నాగ్ : ఇపుడేం చేస్తున్నారు..

 భవాని : ఇంట్లో పనులు.. వంటలో అమ్మకు సాయపడుతున్నా.. ఇంతకూ మీరు ఏం చదివారు.. ఏం చేస్తున్నారు..

 నాగ్ : నేను ఎం.ఏ చదివాను. కడపలో ప్రైవేట్ జాబ్.. నా గురించి మీకు ఇప్పటికే బాగా అర్థం అయిందనుకుంటా.. మిమ్మల్ని ఓ విషయం అడుగుతాను.. ఏమీ అనుకోవద్దు..

 భవాని : అడగండి..

 నాగ్ : మనిద్దం పెళ్లి చేసుకుందాం.. మీకు ఇష్టం ఉంటేనే..

 భవాని : ఇంట్లో వాళ్లకు చెప్పాలి కదా..

 నాగ్ : మీరు మీ ఇంట్లో వాళ్లకు చెప్పండి.. నేను మా ఇంట్లో వాళ్లకు చెబుతా..

 భవాని : సరే

 నాగ్ : మీ ఇంట్లో వాళ్లు ఏమన్నారు..

 భవాని : కడప చాలా దూరం.. వాళ్లు ఎవరో ఏమో అంటున్నారు.

 నాగ్ : నేను మీ ఊరికి వస్తాను.. నా గురించి మీ వాళ్లకు చెబుతాను..

 భవాని : రండి కానీ.. గొడవ గిడవ కాకుండా చూసుకోండి..

 నాగ్ : సరే.. ఈ రోజు రాత్రే బయలుదేరుతున్నాను

 భవాని : ఒకే

 నాగ్ : సార్.. నమస్కారం. మాది వైఎస్‌ఆర్ జిల్లా వేంపల్లె. (తన గురించి భవాని కుటుంబ సభ్యులకు అంతా వివరించాడు. కడప చాలా దూరం కదా.. అని వారంటే.. దూరం ఉన్నంత మాత్రాన వచ్చే ఇబ్బంది ఏమీ లేదని చెప్పి వచ్చాడు.)

 భవాని : మా వాళ్లు ఇంకా ఏమీ చెప్పలేదు.

 నాగ్ : మా అమ్మానాన్నలను పంపుతున్నాను. (ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకుని వారి వివాహానికి పచ్చ జెండా ఊపారు)

 భవాని : మీ అమ్మా నాన్నలు రావడం వల్ల మా అమ్మా నాన్నలు ఒప్పుకున్నారు. పెళ్లి సింపుల్‌గా చేద్దామంటున్నారు.

 నాగ్ : మన పెళ్లి గ్రాండ్‌గా జరగాలి. నేను మా ఇంట్లో వాళ్లకు చెబుతాను.

 వీరిద్దరి వివాహం నిశ్చయమైందని తెలుసుకున్న ‘సాక్షి’ నాగార్జున కుమార్‌ను కలిసింది. ఆ యువతినే ఎందుకు ఇష్టపడ్డారని ప్రశ్నించగా.. ‘ఇద్దరం ఒకే సమస్యతో బాధపడుతున్నాం. మేమిద్దరం దంపతులమైతే అన్ని విషయాల్లో సర్దుకుపోతాం. ఇతరులతో వివాహమైతే ఇగో సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. బయట అలాంటి ఘటనలు ఎన్నో చూస్తున్నాం. దేవుని దయ వల్ల మేమిద్దరం ఒక్కటి కాబోతున్నాం’ అని సైగల ద్వారా తన భావాన్ని వ్యక్తపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement