ఒంగోలు టౌన్ : ‘ఒంగోలు నగరంలోని బండ్లమిట్ట సెంటర్‌లో ఆరు దశాబ్దాలకుపైగా పద్దెనిమిది పేద ముస్లిం కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. చేతివృత్తులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నాయి. పదహారేళ్ల క్రితం ఆ ప్రాంతంలో ఉంటున్న మిగిలిన వారితో కలిపి ముస్లింలకు కూడా ఇళ్ల పట్టాలిచ్చారు. కానీ, రంజాన్ పవిత్ర మాసంలో ప్రార్థనలు చేసుకుంటూ సంతోషంగా గడుపుతున్న ముస్లిం కుటుంబాలను పోలీసులు, రెవెన్యూ సహకారంతో మున్సిపల్ కమిషనర్ చిన్నాభిన్నం చేశారు. వారి ఇళ్లను కూలగొట్టారు. ముందస్తుగా ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా పొక్లెయిన్‌తో ధ్వంసం చేశారు.
ముస్లిం కుటుంబాలను రోడ్డున పడేసి రంజాన్ తోఫా ఇస్తారా’ అని ముస్లిం మతపెద్ద సయ్యద్ హమీద్ ప్రశ్నించారు. బండ్లమిట్టలోని ముస్లిం బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించుకుని అధిక సంఖ్యలో ముస్లింలు కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జేసీ హరిజవహర్‌లాల్‌కు సమస్యను వివరించి న్యాయం కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సయ్యద్ హమీద్ మాట్లాడుతూ బండ్లమిట్టలోని ముస్లింలకు జరిగిన అన్యాయాన్ని చూసి జిల్లావ్యాప్తంగా ఉన్న ముస్లింలు తమకు అన్యాయం జరిగినట్లుగా భావించి రోడ్డు మీదకు వచ్చారన్నారు. ని
బంధనల మేరకు పట్టాలు ఇచ్చినప్పటికీ పథకం ప్రకారం తమ వారికి చెందిన ఇళ్లు, దుకాణాలను ధ్వంసం చేశారన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ముందుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పొక్లెయిన్‌తో నేరుగా వచ్చి పడగొట్టేందుకు సిద్ధపడ్డారన్నారు. రంజాన్ మాసాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు రోజులు గడువు కావాలని కోరినా వినిపించుకోలేదన్నారు. అక్కడి ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు మసీదుకు వెళ్లగానే మానవత్వం అనేది లేకుండా పొక్లెయిన్‌తో పడగొట్టించారన్నారు.
మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేసుకునేందుకు వీలులేకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయించారన్నారు. వారంతా చీకట్లోనే ప్రార్థనలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్క కుటుంబానికి లక్ష నుంచి లక్షన్నర రూపాయల వరకు నష్టం జరిగిందన్నారు. అక్కడే ఉన్న మసీదుకు సంబంధించి హామీ ఇచ్చినట్లుగా బాధిత ముస్లింలకు కూడా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అధికారులను శంకించాల్సి వస్తోంది :
ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్‌లో తీర్మానం పొందిన తరువాతనే 18 మంది ముస్లింలకు పట్టాలు ఇచ్చారని, మిగిలిన వాటిని కాకుండా వాటినే తొలగించడం చూస్తుంటే అధికారులను శంకించాల్సి వస్తోందని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌డీ సర్దార్ పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంతోపాటు నష్టపరిహారం చెల్లించకుంటే జిల్లావ్యాప్తంగా ముస్లింలను సమీకరించి పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
- ఎస్‌డీ సర్దార్
కమిషనర్‌ను సస్పెండ్ చేయాలి :
తమకు ముందస్తుగా ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఇళ్లు, దుకాణాలు కూలగొట్టించిన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని ఎస్‌కే బుజ్జి అనే వెల్డింగ్ అండ్ ఐరన్ వర్క్ దుకాణాదారుడు డిమాండ్ చేశాడు. 300 మంది పోలీసులతో వచ్చి తమ వాటిని కూలదోస్తున్న సమయంలో కమిషనర్‌ను బతిమిలాడినా వినిపించుకోలేదన్నాడు. తాము ఉద్యోగాలు అడగలేదు, రుణాలు అడగలేదు, స్వశక్తితో పనిచేసుకుంటుంటే అక్రమంగా తొలగించేశారని, తమకు న్యాయం చేయాలని కోరాడు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు షేక్ సంధాని, షేక్ హమీద్, షేక్ బుజ్జి, ఆయూబ్ తదితరులు పాల్గొన్నారు.
- ఎస్‌కే బుజ్జి, బాధితుడు
రోడ్డున పడేసి రంజాన్ తోఫా ఇస్తారా..?
Published Tue, Jun 21 2016 4:39 AM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM
Advertisement
Advertisement